
- వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
- ముదిరాజ్ ఫంక్షన్ హాల్, సబ్ సెంటర్, వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కోటగిరి, వెలుగు:రైతులు, పేదల అభివృద్ధే కాంగ్రెస్సర్కారు లక్ష్యమని వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి కోటగిరి మండలంలో పలు కార్యక్రమాల్లో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, నిజామాబాద్ మేయర్ ఉమారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. పోతంగల్, కొత్తపల్లి సొసైటీల పరిధిలో వరి కొనుగోలు కేంద్రాలు, కొత్తపల్లిలో నిర్మించిన ముదిరాజ్ సంఘం ఫంక్షన్ హాల్, హెల్త్ సబ్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పోచారం మాట్లాడుతూ.. రైతులకు బోనస్, రైతు భరోసా, ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ,పేదలకు సొంతిల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హన్మంతు, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కరాటే రమేశ్, సర్పంచ్ లు సంధ్య, గంగారాం, మాజీ జడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ ఎంపీపీ గంధపు పవన్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు షాజీ పటేల్, బర్ల మధు తదితరులు పాల్గొన్నారు.