Reading Time: < 1 minute

లాహోర్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆరిఫ్ మరోసారి తీవ్ర స్థాయి హెచ్చరికలకు దిగారు. భారతదేశం మరోమారు ఎప్పుడైనా తమ దేశంపై చర్యకు దిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చివరికి భారత్‌లోని కోల్‌కతా వంటి సుదూర ప్రాంతాలను కూడా గురిచూసి కొడుతామని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ప్రభుత్వంపై ఓ శక్తి అంతర్గత కుట్రకు దిగుతోందని, దీని వెనుక భారత్ ఉందనే విషయం తమకు తెలుస్తోందని చెప్పిన రక్షణ మంత్రి ఇందుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. పాకిస్థాన్‌పై బయటి నుంచి కానీ లోపలి నుంచి కానీ ఎటువంటి చర్యకు అయినా భారత్ పాల్పడితే తమ చర్యలు అత్యంత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా , ఉధృతంగా ఉంటాయని ఆయన తమ స్వస్థలం సియాల్‌కోట్‌లో మీడియా సమావేశంలో తెలిపారు.