Reading Time: < 1 minute
Pakistan Fuel Price Cut Shehbaz Sharif Relief Measures Middle East War Impact

Pakistan Fuel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల ప్రభావం పాకిస్థాన్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఆ దేశ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు తీవ్రమవుతున్నాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చి దిద్దుబాటు చర్యలు షురూ చేసింది. సామాన్యులను శాంతింపజేసేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అర్ధరాత్రి సంచలన ప్రకటన చేశారు. పెట్రోల్ ధరను ఏకంగా 80 పాకిస్థానీ రూపాయలు తగ్గించారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్ ధర రూ.378కి చేరుకుంది. గురువారం రోజున ప్రభుత్వం పెట్రోల్‌పై 43 శాతం, డీజిల్‌పై 55 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి అంతర్జాతీయ పరిణామాల వల్ల చమురు సరఫరాకు ఆటంకం కలిగిందని, అందుకే ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రధాని వివరించారు. అయినప్పటికీ, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం పెట్రోల్ లెవీని తగ్గించి ఈ ఉపశమనం కల్పించింది. ఈ తగ్గిన ధరలు కనీసం నెల రోజుల పాటు అమలులో ఉంటాయని ప్రధాని స్పష్టం చేశారు.

READ MORE: Drug Party Busted: ‘ఈగల్ టీం’ మెరుపు దాడులు.. డ్రగ్స్ పార్టీలో దొరికిన బాలీవుడ్, టాలీవుడ్ నటులు..!

అంతేకాదు.. పాక్ ప్రధాని మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఫెడరల్ క్యాబినెట్ సభ్యులందరూ రాబోయే ఆరు నెలల పాటు తమ జీతాలు ప్రభుత్వానికి ఇవ్వాలని పేర్కొన్నారు. గతంలో రెండు నెలల పాటు జీతాలు తీసుకోవద్దని అనుకున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా దీనిని ఆరు నెలలకు పొడిగించారు. పొదుపు చర్యల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా ఇతర రాయితీలను కూడా ప్రధాని ప్రకటించారు. మోటార్ సైకిల్ వినియోగదారులకు లీటరుకు 100 రూపాయల సబ్సిడీని, సరుకు రవాణా వాహనాలకు 70 నుంచి 80 వేల రూపాయల వరకు, ప్రయాణీకుల వాహనాలకు లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే చిన్న రైతులకు ఎకరాకు 1,500 రూపాయల చొప్పున సహాయం ప్రకటించారు. రైల్వే ఛార్జీల విషయంలోనూ సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా ఎకానమీ క్లాస్ ధరలను పెంచకూడదని నిర్ణయించారు.