
- సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ
హైదరాబాద్, వెలుగు: దేశంలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని, ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని, లేకపోతే దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో శనివారం నిర్వహించిన ఇంటింటికీ సీపీఐ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాజకీయ అవినీతిని ప్రజలకు వివరించడమే ఇంటింటికీ సీపీఐ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. +
పోరాటాలకు కావాల్సిన వనరులను కార్పొరేట్ శక్తుల నుంచి కాకుండా సామాన్య ప్రజల నుంచే సేకరిస్తున్నామని చెప్పారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎస్.ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి బి.స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, నాయకులు బి.వెంకటేశం, ఎం.నర్సింహ, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కూనంనేనికి పరామర్శ
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సర్జరీ జరిగింది. శనివారం ఆయనను నారాయణ పరామర్శించారు. కూనంనేని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.