
అమరావతి, ఏప్రిల్ 5: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్ధుల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. చకచకా మూల్యాంకనం పూర్తి చేసి ఈ ఏడాది ఇంటర్మీడియట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ నెలలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెలాఖరు నాటికి పది రోజుల తేడాతో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 9న ముగుస్తుంది. ఆ తర్వాత మార్కుల ఎంట్రీ ప్రక్రియ ఉంటుంది . ఈ క్రమంలో ఫలితాల విడుదల ప్రక్రియకు 5 నుంచి ఆరు రోజులు సమయం పడుతుంది. దీంతో ఫలితాలు ఏప్రిల్ మూడో వారంలో 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది.
అనంతరం పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి 15 వరకు సాగుతుంది. ఫలితాలను ప్రాసెస్ చేయడానికి మరో 10 రోజులు పడుతుంది. అంటే ఏప్రిల్ 25వ తేదీ తర్వాత పదో తరగతి ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాట్లు చేస్తుంది. గత సంవత్సరం పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23న ప్రకటించారు. కాగా మార్చి 16న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2న ఇంగ్లీష్ పేపర్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 6,40,916 మంది విద్యార్థులకు హాజరయ్యారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.