
జట్టుపై పన్ను వేయటం విన్నాం.. ఇప్పుడు పశువులపై పన్ను వేయటం చూస్తున్నాం. అవును.. దున్నలు, ఎద్దులు, ఆవులు, గేదెలపై పన్నులు వేస్తోంది పాకిస్థాన్ దేశం.. అవును.. నిజం.. అమ్మతోడు.. ఆర్థిక కష్టాలతో కుస్తీలు పడుతున్న పాకిస్థాన్ దేశం.. డబ్బుల కోసం కొత్త కొత్త పన్నులు వేస్తుంది. ఇందులో భాగంగా ఎద్దులు, దున్నపోతులపై పన్ను వేసింది. ఒక్కో ఎద్దు, దున్నపోతుపై రోజుకు 30 రూపాయలు (పాకిస్థాన్ కరెన్సీలో) కట్టాలని అక్కడి రైతులను ఆదేశించింది. పశువులపై పన్నులు ఏంట్రా అంటే.. శుభ్రత, పరిశుభ్రత.. పశువుల ఉత్పత్తి పెంచటం కోసం అంటూ నంగనాచి కబుర్లు చెబుతుందంట.. మొత్తాన్ని పన్నులు వేయటానికి కారణం ఏంటంటే.. పాకిస్థాన్ దివాళా తీసింది.. డబ్బుల కోసం రకరకాలుగా పన్నులు వేయటం మొదలుపెట్టింది అనేది అసలు విషయం.. ఇంతకీ దున్నలు, ఎద్దులపై పన్నుల మేటర్ పూర్తి వివరాలు తెలుసుకుందామా..
పాకిస్థాన్ ఆర్థిక కష్టాలు ఇప్పుడు ఏ స్థాయికి చేరాయంటే.. అక్కడి నేతలు మనుషుల మీద పన్నులు వేసి విసిగిపోయి, చివరకు నోరులేని పశువుల మీద పడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ ప్రభుత్వం.. తాజాగా పంజాబ్ ప్రావిన్స్‌లో ఒక వింత పన్నును ప్రవేశపెట్టింది. అదే ‘గోబర్ ట్యాక్స్’ అంటే గేదె పేడ మీద పన్ను అనమాట. అవును మీరు విన్నది నిజమే! పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఇకపై ఒక్కో గేదె లేదా ఆవు వేసే పేడపై రోజుకు 30 పాకిస్థానీ రూపాయలు పన్ను చెల్లించాల్సిందే. దేశం దివాళా తీసి, ఐఎంఎఫ్ అప్పుల కోసం అల్లాడుతున్న వేళ.. ఇలా పేడ మీద కూడా ఆదాయం వెతుక్కోవడం పాక్ పాలకుల ఆర్థిక తెలివితేటలకు నిదర్శనమంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
‘సుత్రా పంజాబ్’ అంటే పరిశుభ్రమైన పంజాబ్ అనే అందమైన పేరుతో ఈ కొత్త వసూళ్లను పాక్ ప్రభుత్వం మొదలుపెట్టింది. లాహోర్‌లోని హర్బన్స్‌పురా, గుజ్జర్‌పురా వంటి ప్రాంతాల్లోని 168 పశువుల కాలనీలను టార్గెట్ చేస్తూ.. ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ పేడను సేకరించి బయో గ్యాస్, విద్యుత్, సేంద్రియ ఎరువులుగా మారుస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ప్రజలు మాత్రం దీన్ని పేడ పన్నుగానే చూస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో బతుకు భారమైన పాక్ ప్రజలకు ఇప్పుడు పశువుల పేడ కూడా ఒక ఖర్చుగా మారడం కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది.
మరోవైపు.. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో, పాకిస్థాన్ ప్రభుత్వం కేవలం నెల వ్యవధిలోనే రెండోసారి పెట్రోల్ ధరలను పెంచేసింది. పెట్రోల్ ధర 42.7 శాతం పెరిగి 458 పాకిస్థానీ రూపాయలకు చేరగా, డీజిల్ ధర ఏకంగా 54.9 శాతం పెరిగి 520 పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. అమెరికా-ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్ అదుపు తప్పింది.. ధరలు పెంచక తప్పలేదని పాక్ పెట్రోలియం మంత్రి అలీ పర్వైజ్ మాలిక్ చేతులెత్తేశారు. ఒకపక్క యుద్ధ భయాలు, మరోపక్క సప్లై చైన్ దెబ్బతినడం పాక్ ఆర్థిక వ్యవస్థను ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి.
ALSO READ : అన్నంత పని చేసిన ట్రంప్..
ఇలాంటి క్లిష్ట సమయంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వం సూక్ష్మ స్థాయి పన్నులపై ఆధారపడుతోంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వంటి కీలక సముద్ర మార్గాల్లో ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగితే.. దిగుమతులపై ఆధారపడే పాకిస్థాన్ పరిస్థితి ఇంకా ఘోరంగా మారనుందని ఈ పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. అప్పులు కట్టడానికి కొత్త అప్పులు వెతుక్కుంటున్న పాక్ ప్రభుత్వం.. చివరికి గేదె పేడను కూడా వదలకుండా ట్యాక్స్‌లు వేయడం చూస్తుంటే, ఆ దేశం ఎంతటి ఆర్థిక ఎమర్జెన్సీలో ఉందో తెలుస్తోంది. అయితే ఈ పేడ టాక్స్ ఎంతవరకూ ఫలిస్తుందనే వేచి చూడాల్సిందే మరి.