
కోర్టు నిర్మాణం అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ తో కట్టే భవనం కాదని అది కోట్లాది మంది సామాన్యులకి న్యాయం మీద కలిగించే నమ్మకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేందర్ నగర్ లో లో హైకోర్టు జోన్ 2 భవనానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. దేవాలయం ఒక మతానికి పరిమితం కావచ్చు.. కానీ ఈ న్యాయస్థానం సమాజంలోని ప్రతి ఒక్కరికీ చెందుతుందన్నారు. ఇది కేవలం భౌతిక నిర్మాణం కాదు.. మన ప్రజాస్వామ్యానికి ఒక శాశ్వత ప్రతీక అని అన్నారు. రాబోయే తరాలకు ఇదొక ఆశాకిరణంగా నిలుస్తుందన్నారు రేవంత్ .
►ALSO READ | బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
పేదవాడి చివరి ఆశ కోర్టు, ఈ రోజు వేస్తున్న ఈ పునాది.. వచ్చే శతాబ్దానికి న్యాయాన్ని నిలబెట్టే పునాదిగా మారుతుందన్నారు. విభేదాలు కాదు, సమన్వయమే ప్రజాస్వామ్య బలమని చెప్పారు. హైదరాబాద్ చరిత్రలో ఈ రోజు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఇక్కడి నుండి వెలువడేది కేవలం తీర్పులు మాత్రమే కాదు.. ప్రతి పౌరుడికీ న్యాయం మీద కలిగే భరోసా అని అన్నారు. తమ ప్రభుత్వానికి ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు.. ఇదొక బాధ్యత అని అన్నారు. తాము మాటలతో కాదు.. అత్యాధునిక మౌలిక వసతులతో న్యాయానికి అసలైన గౌరవం ఇస్తున్నామని చెప్పారు రేవంత్ .
హైకోర్టు రాజ్యాంగ బాధ్యత
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో హైకోర్టు కొత్త సముదాయం నిర్మాణం అద్భుతంగా ఉంది. తెలంగాణ హైకోర్టుకు ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్.కోర్టు గదులు మాత్రమే కాదు, వాటి వెనుక పెద్ద వ్యవస్థ ఉంటుంది. న్యాయవ్యవస్థ సజావుగా నడవడానికి మౌలిక వసతులు చాలా అవసరం. తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా ఆలోచన చేసి నూతన హైకోర్టు భవనం నిర్మాణం చేపట్టింది. ప్రతి రాష్ట్రంలో హైకోర్టు ఉండటం రాజ్యాంగ బాధ్యత. ఇది కేవలం చట్టపరమైన అవసరం కాదు. పాత హైకోర్టు చారిత్రాత్మకమైనది కానీ ప్రస్తుతం సరిపోవడం లేదు.దీంతో పాటు ఆధునిక అవసరాలకు తగినది కాదు. వచ్చే 100 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన హైకోర్టు నిర్మాణం ప్రణాళిక ను రూపొందించారు. నూతన హైకోర్టు సముదాయంలో అన్ని సదుపాయాలు ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేశారు ‘అని అన్నారు.