
జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభలో సీట్లు కోల్పోతాయని వస్తున్న వాదనలలో వాస్తవం లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. శనివారం కేరళలోని పథనంథిట్ట తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. కేరళలో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని స్పష్టం చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మాదిరిగా అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతామనన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరుపై మండిపడ్డారు.
పశ్చిమాసియా అంశంపై భయాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలో శబరిమల రైల్వే ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకురాగలదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది శబరిమలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, స్థానిక వ్యాపారాలకు కొత్త ఊపు ఇస్తుందని చెప్పారు. యువతకు కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తుందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. బిజెపి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు.