
‘నిజమేనా నిజమేనా నే విన్నది నిజమేనా, నువు పలికిన ఆ మాటే పొరబడి విన్నానా..’ అంటూ ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం నుంచి శనివారం ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్నారు. వి.మునిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభించగా, తాజాగా మరో సాంగ్‌ను రిలీజ్ చేశారు.
వంశీకాంత్ రేఖన కంపోజ్ చేసిన పాటకు సనరే లిరిక్స్ రాయగా, జయశ్రీ పల్లెం పాడిన తీరు ఆకట్టుకుంది. ‘నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా కను తెరిచి నీ ముందే కలనే కన్నానా, ప్రతి క్షణం నీ వెంటే ఇన్నాళ్లుగా తిరిగానే, నేనేమిటో కొంచెం కూడా అర్థం కాలేదా..’ అంటూ హార్ట్ టచింగ్‌గా సాగిన పాట సినిమాపై ఆసక్తిని పెంచింది. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.