Reading Time: 2 minutes

ఎఐ, లైఫ్ సైన్సెస్, ఫిన్‌టెక్, అగ్రి-టెక్ వంటి రంగాల

సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యం

విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు

భారత్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

కొలంబియా బిజినెస్ స్కూల్‌లో జరిగిన

ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు

ముఖ్య అతిథిగా హాజరైన కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభివర్ణించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్‌లో జరిగిన 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఉద్దేశించి తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దశాబ్ద కాలం పాటు జరిగిన అభివృద్ధి గురించి కెటిఆర్ మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాటం ద్వారా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం, తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పరిపాలన, ఆవిష్కరణలు, ఆర్థిక వృద్ధిలో దేశానికే దిక్సూచిగా నిలిచిందని అన్నారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష, పురోగతికి నిదర్శనం అని పేర్కొన్నారు. తాము అవకాశాల కోసం ఎదురుచూడలేదు అని, వాటిని అందిపుచ్చుకునేందుకు అద్భుతమైన పాలసీలను తయారు చేశామని తెలిపారు.

మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని అన్నారు. 2027లో భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవానికి సిద్ధమవుతున్న వేళ, కేవలం పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని చెప్పారు. రాష్ట్రాన్ని దేశాన్ని నడిపే నాయకత్వానికి స్పష్టత ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందని, తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. భవిష్యత్తు గురించి కేవలం మాటలు చెప్పడం కంటే, దానిని మనమే సృష్టించడం ఉత్తమమైన మార్గం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలే దేశాభివృద్ధికి ఇంజన్లు అన్న ప్రాథమిక విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని ప్రస్తావిస్తూ.. దేశాభివృద్ధి అనేది కేవలం ఒకే రకమైన విధానాల వల్ల కాకుండా, ప్రతి రాష్ట్రం తనకున్న ప్రత్యేక బలాలను వినియోగించుకోవడం ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. భారతదేశం 28 ఇంజన్లు కలిగిన ఒక ఫార్ములా 1 రేసింగ్ కార్ లాంటిదని, ప్రతి రాష్ట్రం తనదైన శైలిలో అభివృద్ధి చెందుతూ దేశ ప్రగతికి తోడ్పడాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ పెట్టుబడి నిర్ణయాలు చివరికి రాష్ట్రాలు, నగరాల స్థాయిలోనే జరుగుతాయని గుర్తుచేశారు.

ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారింది

ఐటి, పారిశ్రామిక రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని కెటిఆర్ తెలిపారు. 2014 నుండి 2023 మధ్య కాలంలో తెలంగాణ సాంకేతిక రంగం సాధించిన గణాంకాలను వివరించారు. ఐటీ ఎగుమతులు రూ. 57,000 కోట్ల నుండి రూ. 2.72 లక్షల కోట్లకు పెరిగాయని, ఐటీ ఉద్యోగాల సంఖ్య 3.23 లక్షల నుండి దాదాపు 10 లక్షలకు చేరుకుందని తెలిపారు. ప్రభుత్వ వేగవంతమైన నిర్ణయాలు, పటిష్టమైన ఎకో సిస్టమ్ కారణంగానే హైదరాబాద్ గ్లోబల్ ఐటీ దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పారు. హైదరాబాద్‌లో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను ఏర్పాటు చేసిందని, గూగుల్, ఆపిల్, మెటా, సేల్స్ ఫోర్స్, ఉబర్, మైక్రాన్ టెక్నాలజీ వంటి సంస్థలు తమ కీలక కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఆవిష్కరణలకు చిరునామా తెలంగాణ మారిందని వ్యాఖ్యానించారు.

టీ -హబ్, వీ-హబ్, టీ- వర్క్, టాస్క్ వంటి సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలకు పెద్దపీట వేసిందని తెలిపారు. స్కైరూట్ ఏరోస్పేస్, డార్విన్ బాక్స్, జెనోటి, హైరేడియస్ వంటి యూనికార్న్ సంస్థలు హైదరాబాద్ నుండి పుట్టుకురావడమే తెలంగాణ సత్తాకు నిదర్శనమన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిందని, ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. ఏటా 10 బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తోందని, దేశీయ బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో 40 శాతం వాటా తెలంగాణదేనని చెప్పారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పుల గురించి ప్రస్తావిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), లైఫ్ సైన్సెస్, ఫిన్‌టెక్, అగ్రి-టెక్ వంటి రంగాల సమ్మేళనంతోనే తదుపరి వృద్ధి సాధ్యమని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు, నిపుణులు భారత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కేవలం ఆలోచనల దగ్గర ఆగిపోకుండా వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. నేటి సమస్యల పరిష్కారమే కాదు.. రేపటి అవసరాలకు తగిన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.