Reading Time: < 1 minute

ఇరాన్ లోని బుషెహర్ అణువిద్యుత్ కేంద్రం లక్షంగా క్షిపణి దాడి జరిగిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఎఇఎ) తెలియజేసింది. ఇటీవలి కాలంలో ఇది నాలుగో ఘటన అని పేర్కొంది.ఈ క్షిపణి శకలం తగిలి సిబ్బందిలో ఒకరు చనిపోయారని తెలిపింది. ఆ ప్రాంతం లోని భవనం కూడా దెబ్బతిన్నట్టు వివరించింది. ఈ సంఘటన న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో రేడియేషన్‌కు దారి తీయలేదని స్పష్టం చేసింది. ఇరాన్‌లో ప్రస్తుతం పనిచేస్తున్న ఏకైక విద్యుత్ ప్లాంట్ ఇదే కావడం గమనార్హం.

తాజా పరిణామాలపై ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ మరియానో గ్రాస్సీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా భవనాల్లో కీలకమైన పరికరాలు ఉండే అవకాశం ఉందన్నారు. అణు కేంద్రాల సమీప ప్రాంతాలపై ఎన్నడూ దాడి చేయకూడదన్నారు. అణు ప్రమాదం ముప్పును నివారించేందుకు అత్యంత సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అణుభద్రత, రక్షణకు కట్టుబడి ఉండటం అత్యంత ప్రాధాన్య అంశమని ఉద్ఘాటించారు.