
హుజూరాబాద్ ఎంఎల్‌ఏ కౌశిక్ రెడ్డిని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో పోలీసు విధులకు భంగం కలిగించడం, రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన కేసులో కౌశిక్ రెడ్డి, ఆయన భార్య శాలినీ రెడ్డితో కలిసి శనివారం సిఐడి అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. జనవరి 29వ తేదీన హుజూరాబాద్‌లోని సమ్మక్క జాతర వేళ పోలీసులకు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసుల విధులకు అడ్డంకి, దూషణలు, మతవిద్వేష వ్యాఖ్యలు చేసినట్లు కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ నేపథ్యంలో విచారణకు రావాల్సిందిగా సిఐడి అధికారులు కౌశిక్ రెడ్డికి ఇటీవల నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణకు హాజరయిన కౌశిక్ రెడ్డిని అధికారులు నాలుగు గంటల పాటు విచారించి, ప్రక్రియను వీడియో రికార్డు చేశారు. విచారణ అనంతరం కౌశిక్ రెడ్డి సిఐడి కార్యాలయం వెలుపల మీడియా ప్రతినిధుతలో మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు.
తనను, తన కుటుంబాన్ని రాజకీయంగా వేధించడానికి ఈ విచారణలు జరుపుతున్నారని ఆరోపించారు. అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని, పొంగులేటి మైనింగ్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే తనపై ఎథిక్స్ కమిటీ వేశారని కౌశిక్ రెడ్డి చెప్పారు. ప్రజల పక్షాన పోరాడటానికి దేనికైనా సిద్ధమని, హుజూరాబాద్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కరీంనగర్ జిల్లా చెత్తనంతా తెచ్చి హుజూరాబాద్‌లో వేస్తే ఊరుకునేది లేదని, ఆ డంపింగ్ యార్డ్ కరోనా కంటే ప్రమాదమని, ఈ విషయంలో చేస్తున్న పోరాటాన్ని అణచివేయడానికి విచారణ పేరుతో ప్రభుత్వం వేధిస్తోందన్నారు. ఈ నెల 7వ తేదీన హుజూరాబాద్‌లో దీక్షకు కూర్చుంటానని, మత మార్పిడిలపై వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. మళ్లీ కెసిఆర్ సిఎం అవుతారని అప్పుడు కేసులు తిరగబడతాయని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.