
బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శం. దేశంలోని దళితులకు చిహ్నంగా బాబూజీగా మారారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 5న ఆయన జయంతిని ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లా చంద్వా అనే గ్రామంలో బాబూజీ ఒక సామాన్య కుటుంబంలో 1908 ఏప్రిల్ 5న జన్మించారు. ఆయనకు అన్నయ్య సంత్ లాల్, ముగ్గురు అక్కచెల్లెళ్లు. జగ్జీవన్ రామ్ చదువుకుంటున్న రోజుల్లో స్కూల్లో అగ్రకులాల పేరుతో వేరువేరు మంచినీటి కుండలుండేవి. ఒకరోజు దాహంతో ఉన్న జగ్జీవన్ రామ్ తెలియనితనంతో ఓ అగ్రకుల (హిందూ) కుండలోని మంచినీళ్లు తీసుకుని తాగాడు.
ఇది చూసిన అగ్రకులాల విద్యార్థులు చర్మకారుడైన అయిన జగ్జీవన్ రామ్ ముట్టుకున్న కుండని మేం ముట్టుకోం అంటూ స్కూలు కుండలో మంచి నీటిని తాగడం మానేశారు. దీంతో హెడ్మాస్టర్ అగ్రకుల విద్యార్థులకు, దళిత విద్యార్థులకు వేరు వేరు మంచినీటి కుండలు పెట్టించారు. ఇది చూసిన జగ్జీవన్ రామ్ తన దళితుల స్థాయి ఇంత హీనమైనదా అని తీవ్రంగా కలత చెంది ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్కూల్లో పెట్టిన రెండు కుండలను పెట్టినప్పుడల్లా జగ్జీవన్ రామ్ బద్దలు కొట్టేసేవాడు. హెడ్ మాస్టర్ కు తెలిసినప్పటికీ ఏం చేయలేని పరిస్థితి. చివరికి అభిమతాన్ని గుర్తించి ఒక్కటే నీళ్లకుండ పెట్టించారు.
విద్య, రాజకీయ జీవితంలో- మలుపులు
బాబూజీ 1927లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అప్పట్లో బాబూజీకి బాల్యవివాహం జరిగింది. భార్య కొద్ది కాలానికే చనిపోవడంతో తిరిగి 1935లో డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణి దేవితో పెళ్లి జరిగింది. వీరికి సురేష్ కుమార్, మీరా( మాజీ లోక్ సభ స్పీకర్) అనే ఇద్దరు సంతానం కలిగారు. 1935లో కాన్పూర్‌లో జరిగిన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ (అఖిల భారత దళిత వర్గాల సంఘం) మహాసభలకు అధ్యక్షత వహించగా ఈ మహాసభలను గాంధీ ప్రారంభించారు.
డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్‌కు 1936 నుండి 1942 వరకు బాబూజీ అధ్యక్ష వహించారు. అదే సమయంలో బిహార్ శాసనమండలికి నామినేట్ అయ్యారు. 15 ఎస్సీ రిజర్వుడు ఎమ్మెల్యే స్థానాలకు జగ్జీవన్ రామ్ అభ్యర్థులను పోటీకి దింపితే.. 15 నియోజక వర్గాలకు 15 మంది అభ్యర్థులు గెలిచారు. వీరిలో 14 మంది ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం. 1942 ఆగస్టు 7 న ప్రారంభమైన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జగ్జీవన్ రామ్ జైలుకు వెళ్లవలసి వచ్చింది. 1943లో జగ్జీవన్ రామ్ జైలు నుంచి విడుదలయ్యాడు.
నెహ్రూ కేబినెట్లో మంత్రిగా..
బాబూజీ విస్తృత పర్యటనలు చేసి, సభలు, సమావేశాలు పెట్టి, దళిత వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారు. 1946లో నెహ్రూ కేబినెట్లో మొదటి మంత్రి మండలిలో జగ్జీవన్ రామ్ మొదటి కార్మికశాఖ మంత్రిగా చేరారు. అప్పటి నుంచి 29 సంవత్సరాలు కేంద్రమంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా, సెంట్రల్ పార్లమెంట్ బోర్డు సభ్యునిగా, పీసీసీ అధ్యక్షునిగా, ఇంకా అనేక కీలక పదవులను బాబూజీ చేపట్టడం విశేషం. 1947లో రాజ్యాంగ పరిషత్తుకు బాబూజీ ఎన్నికయ్యారు. ఇదే ఏడాది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక మహాసభ అధ్యక్షునిగా బాబూజీ ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా పలు శాఖలను దాదాపు మూడు దశాబ్దాలు ఎంతో బాధ్యతతో చేపట్టారు.
జగ్జీవన్ రామ్ ఆశయాలు స్ఫూర్తిదాయకం
1985లో దేశ ప్రజలు బాబూజీ జన్మదినోత్సవాన్ని ‘సమతా దివస్’గా జరుపుకున్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశమంతటా 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. జూలై 7వ తేదీని రాష్ట్ర ప్రభుత్వాలు సంతాప సెలవు దినాన్ని ప్రకటించాయి. బాబూజీ జయంతి సందర్భంగా దేశంలో గౌరవంగా సెలవు దినంగా కొనసాగిస్తున్నాం.
దేశంలో ఎక్కువ కాలం పనిచేసిన కేంద్ర మంత్రిగా బాబూజీ రికార్డు సృష్టించారు. ఆయన కుమార్తె మీరాకుమార్ 2009–-2014 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. బాబూ జీ గురించి విద్యాసంస్థల్లో సిలబస్ పెట్టాలి. జగ్జీవన్ రామ్ 1986 జులై 6న మరణించారు. జగ్జీవన్ రామ్ లాంటి మార్గదర్శకులను సంపూర్ణంగా స్మరించుకోవాలి. బాబూజీకి భారతరత్న పురస్కారం ప్రకటించి ఆయన సేవలను స్మరించుకోవాలి.
పట్ట హరిప్రసాద్
* ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.