
- టెండర్ లేకుండానే ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణం
- నిలిచిపోయిన రూ.7 కోట్ల బిల్లులు
- స్మార్ట్ సిటీ రోడ్లు, జంక్షన్లు, కేబుల్ బ్రిడ్జిపైనా వేర్వేరుగా విజిలెన్స్ ఎంక్వైరీలు
- విచారణ పూర్తయినా చర్యల్లో జాప్యం
- మానేరు రివర్ ఫ్రంట్‌పై విజిలెన్స్ ఎంక్వైరీకి బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ నేతల డిమాండ్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేపట్టిన వందల కోట్ల పనులపై గత రెండేళ్లలో చేపట్టిన విజిలెన్స్ ఎంక్వైరీలు అటకెక్కాయి. కేబుల్ బ్రిడ్జి, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, స్మార్ట్ సిటీ వర్క్స్, జంక్షన్ల అభివృద్ధి, మున్సిపాలిటీ శానిటేషన్ విభాగంలో డీజిల్ వినియోగంలో అవకతవకలపై విచారణలు పూర్తయినా చర్యల్లో జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనుల్లో అక్రమాలపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ లీడర్లు, సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ప్రభుత్వం ఈ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది.
దీంతో ప్రాంతీయ విజిలెన్స్ ఆఫీసర్లు పనుల అంచనా, టెండర్లు, మంజూరైన నిధులు, చేసిన ఖర్చుపై ఎంక్వయిరీ చేశారు. ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్, జంక్షన్ల అభివృద్ధి, కిసాన్ నగర్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం, నిధుల రికవరీ చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మానేరు రివర్ ఫ్రంట్ పనులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేశాకే మిగతా పనులు పూర్తి చేయాలని బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రూ.7.05 కోట్ల నుంచి రూ.13 కోట్లకు పెరిగిన గెస్ట్ హౌస్ అంచనా..
బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కరీంనగర్ సిటీలో నిర్మించిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణంలో అక్రమాలు వెలుగు చూశాయి. ఆర్ అండ్ బీ ఆఫీసర్లు తొలుత రూ.7.05 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కానీ రూ.13 కోట్లతో ఈ బిల్డింగ్ పనులు పూర్తి చేశారు. మొదట రూ.6 కోట్ల వరకే టెండర్లు పిలిచి పనులు చేపట్టారు. తీరా బిల్డింగ్ ప్రారంభోత్సవం పూర్తయ్యాక మరో రూ.7 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. రూ.7 కోట్ల పనులను ముందే పూర్తి చేసి ఆ తర్వాత టెండర్లు పిలవడంపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆర్ అండ్ బీ ఇంజినీర్లను విచారించి బిల్డింగ్ టెండర్లు, కేటాయింపు, నిధుల ఖర్చుకు సంబంధించిన వివరాలు రాబట్టారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో కాంట్రాక్టర్ కు మిగతా బిల్లులు చెల్లించలేదని తెలిసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇంజినీర్లపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
స్మార్ట్ సిటీ పనులపై విజిలెన్స్..
కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపిక కాగా మూడు ప్యాకేజీల్లో 52 ప్రాజెక్టులతో రూ.936.94 కోట్ల పనులు ప్రారంభించారు. ఇందులో రూ.580 కోట్ల విలువైన రోడ్లు, డ్రెయినేజీ, రెయిన్ డ్రెయిన్స్, పార్కులు, తాగునీటి సరఫరా, కమాండ్ కంట్రోల్ రూమ్, గ్రీనరీ, లైటింగ్స్, జంక్షన్ల బ్యూటిఫికేషన్, ఫుట్ పాత్ ల నిర్మాణం, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, జంక్షన్లలో సిగ్నలింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రధానంగా జంక్షన్ల బ్యూటిఫికేషన్ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందిరా చౌక్ లోని జంక్షన్ బ్యూటిఫికేషన్ కు రూ.50 లక్షలు కూడా ఖర్చు చేయకుండా సుమారు రూ.1.30 కోట్ల బిల్లులు డ్రా చేశారనే విమర్శలు ఉన్నాయి. ఖర్చుకు తగ్గ పనులు చేయలేదని, చేసిన పనులకు థర్డ్ గ్రేడ్ క్వాలిటీ మెటీరియల్ వాడారనే ఆరోపణలు ఉన్నాయి.
స్మార్ట్ సిటీ పనులపై ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024 డిసెంబర్ 18, 19 తేదీల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. రూ.64.84 కోట్ల నిధులతో హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మించిన రోడ్లు, సైడ్ డ్రెయిన్స్ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం అస్యూరెన్స్ ఫండ్స్ రూ.125 కోట్లతో చేపట్టిన పనులపైనా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. సర్కార్ కు ఈ పనులకు సంబంధించిన విజిలెన్స్ నివేదికలు అందినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన పెండింగ్ పనుల పూర్తికి నిధులు విడుదల కావడం లేదు.
కిసాన్ నగర్ మార్కెట్లో ఎంబీ బుక్ మాయం..
రూ.5.8 కోట్ల వ్యయంతో కరీంనగర్ కిసాన్ నగర్ లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయి. మొదటి దశలో పనుల పురోగతిని నమోదు చేసిన మెజర్ మెంట్ బుక్(ఎంబీ నంబర్ 152/ఎంసీకే/2021-22) మాయమైంది. దీంతో రూ.87.78 లక్షల పనులకు లెక్క లేకుండా పోయింది. ఈ బుక్ మాయంపై పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగం చేయడం వల్లే ఎంబీ బుక్ ను మాయం చేశారని మాజీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో వారు బిల్లులు నిలిపివేయడంతోపాటు ఎంక్వైరీ చేపట్టారు. ఇప్పటికీ ఈ నిధుల దుర్వినియోగం వ్యవహారం కొలిక్కి రాలేదు.
కేబుల్ బ్రిడ్జిపై పూర్తయిన ఎంక్వైరీ..
మానేరువాగుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పనుల్లో నాణ్యత లోపించిందని, రూ. కోట్లు దుర్వినియోగమయ్యాయని కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ చేపట్టింది. 8 నెలల క్రితమే విచారణ పూర్తయింది. కేబుల్ బ్రిడ్జికి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మొదటగా రూ.80 కోట్లు కేటాయించగా, అప్రోచ్ రోడ్లతో కలిపి రూ.224 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేశారు. బ్రిడ్జి ప్రారంభించిన కొద్ది రోజులకే తారు దెబ్బతినడం, డిజిటల్ లైట్లు వెలగకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ లైట్లు వెలగడం లేదు.