Reading Time: 3 minutes

16 ఏళ్లుగా స్ట్రగుల్స్: ఈ నటుడి ప్రతి రిజెక్షన్ ఓ పాఠమే.. ‘ఉజైర్’గా ‘ధురంధర్’తో వెలుగులోకి

Caption of Image.

పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు దానిష్ పండోర్ (Danish Pandor). ‘ధురంధర్’ చిత్రంలో ‘ఉజైర్ బలోచ్’ పాత్రతో స్టార్‌‌డమ్ సంపాదించిన ఆయన, ఈ స్థాయికి చేరుకోవడానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. ధురంధర్ సినిమాలో రణ్​వీర్​తో స్క్రీన్​షేర్ చేసుకున్న ఈ నటుడి సినీ ప్రయాణం, జీవిత విశేషాలు ఈవారం పరిచయంలో..  

దానిష్ పండోర్ ముంబైలో పుట్టాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు దానిష్‌‌‌‌. ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌కు చాలా ప్రాధాన్యం ఇచ్చే దానిష్​ షూటింగ్ లేని సమయంలో ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతాడు. అతనికి చిన్నప్పటినుంచి ఫిట్‌‌‌‌నెస్, పర్సనాలిటీ డెవలప్‌‌‌‌మెంట్, క్రియేటివ్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి ఉండేది. కానీ, కుటుంబం ఆర్థిక పరిస్థితి అంత​ంతమాత్రమే కావడంతో అతను చదువుపై దృష్టి పెట్టాడు.

ముంబై యూనివర్సిటీలో బిజినెస్ అండ్ ఫైనాన్స్‌‌‌‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత  మోడలింగ్ వైపు అడుగులు వేశాడు. 2007లో ప్రతిష్టాత్మకమైన ‘గ్లాడ్రాగ్స్ మ్యాన్‌‌‌‌హంట్’ పోటీలో పాల్గొని మొదటి ఐదుగురిలో ఒకరిగా నిలిచాడు. అలా గ్లామర్ ప్రపంచంలోకి మొదటి అడుగుపడింది. అయితే, కేవలం మోడలింగ్‌‌‌‌తో సరిపెట్టుకోకుండా, నటనలో మెలకువలు నేర్చుకోవడానికి ముంబైలోని ‘కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్’లో శిక్షణ పొందాడు దానిష్​.

మలుపు తిప్పిన కాలం

ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ దానిష్ కెరీర్‌‌‌‌కు కొత్త ఊపిరి పోశాయి. నెట్‌‌‌‌ఫ్లిక్స్ సిరీస్ ‘సేక్రెడ్ గేమ్స్’లో ‘బడా బదరియా’ పాత్రతో ఆయన నటుడిగా గుర్తింపు పొందాడు. ఆ పాత్ర చిన్నదైనా, తన స్క్రీన్ ప్రెజెన్స్‌‌‌‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ‘మత్స్య కాండ్’, ‘బాంబర్స్’ వంటి సిరీస్‌‌‌‌లలో వైవిధ్యమైన పాత్రలు పోషించి వెర్సటైల్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

2024 ఏప్రిల్‌‌‌‌లో జీవితం మలుపు తిరిగింది. ముఖేష్ ఛబ్రా ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. “ఆడిషన్ ఇవ్వమన్నారు. ఫిల్మ్ ఏమిటో, డైరెక్టర్, కాస్ట్ ఎవరో ఏమీ తెలియదు. దీన్ని సీక్రెట్​గానే ఉంచమన్నారు” అని ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆడిషన్ ఇచ్చి ఎంపికైనప్పుడు తెలిసింది అది ఆదిత్య ధర్ డైరెక్షన్​లో వస్తోన్న ‘ధురంధర్’ చిత్రం అని.

ధురంధర్ నటుడిగా..

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, సంజయ్ దత్ వంటి పెద్ద స్టార్స్​తో కలిసి నటించిన ‘ధురంధర్’ దానిష్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో ఆయన పాకిస్తానీ గ్యాంగ్‌‌స్టర్ ఉజైర్ బలోచ్ అనే పాత్ర  పోషించాడు. మేకప్ లేకుండా, కేవలం కళ్లతోనే భయం పుట్టించేలా ఆయన చేసిన నటనకు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు.

ఈ సినిమాలో చాన్స్​ రావడం అదృష్టంగా భావించాడు దానిష్​. కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ ఛబ్రా సుమారు ఏడు వందల మంది నటులను ఆడిషన్ చేసిన తర్వాత, దానిష్‌‌లోని ఇంటెన్స్​ యాక్టింగ్ చూసి ఈ పాత్రకు ఎంపిక చేశారు. ఉజైర్ బలోచ్ పాత్ర సహజంగా ఉండటం కోసం, కరాచీలోని లయారీ ప్రాంత గ్యాంగ్ వార్స్ గురించి, అక్కడి నేరస్థుల బాడీ లాంగ్వేజ్ గురించి లోతుగా అధ్యయనం చేశాడు.

‘ధురంధర్ 2’లో తను వయసు మళ్లిన గ్యాంగ్‌‌స్టర్ ‘బడే సాహెబ్’ లుక్ కోసం ప్రతిరోజూ 4 గంటల పాటు ప్రోస్థటిక్ మేకప్ వేయించుకునేవాడు. డైరెక్ట్ కోచింగ్ తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్, వెపన్స్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నాడు. తన కష్టానికి జీవితంలో మర్చిపోలేని ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉందని దానిష్ చెప్పాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. 2026లో రెండో భాగం విడుదలయ్యి ఇండస్ట్రీలో అతిపెద్ద హిట్స్​లో ఒకటిగా నిలిచింది. దీంతో దానిష్ పేరు దేశవ్యాప్తంగా తెలిసింది. ఇప్పుడు దానిష్ ఒక నటుడు మాత్రమే కాదు, టాలెంట్‌‌కు అంకితభావం తోడైతే విజయం వరించి తీరుతుందని నిరూపించిన ఇన్​స్పైరింగ్ పర్సనాలిటీ.

తన మాటల్లో..

మోడలింగ్ జీవితం మొదలైంది. 3-4 సంవత్సరాలు మోడలింగ్ చేశా. కానీ సినిమాల పట్ల ఉన్న ప్రేమతో కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌లో నాలుగు నెలల కోర్సు చేశా. కాలేజీ చదువుతోపాటు ఈ కోర్సు పూర్తి చేశా. చదువు, మోడలింగ్, నటన.. మూడింటినీ బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. కానీ నా లక్ష్యం ఎప్పుడూ సినిమానే. ఆడిషన్స్ నాకు 9 –5 జాబ్ లాగా అయిపోయాయి.

ప్రతి రోజు కాస్టింగ్ డైరెక్టర్లకు మెసేజ్‌‌‌‌లు పంపేవాడిని. వాళ్లకు రోజుకు వందల మెసేజ్‌‌‌‌లు వస్తుంటాయి. ఆడిషన్ ఎక్కడ జరుగుతుందో, ఎవరిని సంప్రదించాలో ఎవరికి తెలియదు. అలాగే ఆడిషన్ ఇచ్చి రిజెక్ట్​ అవ్వడం సర్వసాధారణమైపోయింది. కొన్ని ప్రాజెక్టుల్లో సంతకం చేసిన తర్వాత కూడా రీప్లేస్ అయ్యాను. అది చాలా కష్టమైన ఫేజ్. ఏమి జరుగుతుందో అనే భయం ఎప్పుడూ ఉండేది. సంవత్సరాల తరబడి పని లేకుండా గడిపా. ఆడిషన్స్ కోసం డబ్బు కూడబెట్టడానికి లాంగ్ అవర్స్ పని చేశా. 

‘ఛావా’ చిత్రంలో పాత్ర కోసం 96 కేజీల నుంచి 80 కేజీల బరువు తగ్గా. ఈ టైంలో ఫ్యామిలీ సపోర్ట్​ ఒక్కటే నా ఆధారం. స్క్రిప్ట్ చదివి షాక్ అయ్యా. ఇంత ఇంటెన్స్ పాత్రనా అని. షూటింగ్ సెట్స్‌‌‌‌లో రణ్​వీర్ సింగ్ తనకు ఇచ్చిన మద్దతు మరువలేనిది. ఆయన నుంచి పని పట్ల డెడికేషన్​ నేర్చుకున్నా. నేను కేవలం డబ్బు కోసం సినిమాలు చేయను. నా పాత్రలో ప్రత్యేకత ఉంటేనే ప్రాజెక్ట్ ఓకే చేస్తాను.

ఇప్పుడు నన్ను ‘ఉజైర్’ అని పిలుస్తున్నారు. పాపులారిటీ సర్‌‌‌‌ప్రైజ్‌‌‌‌గా ఉంది. కానీ నేను గ్రౌండెడ్‌‌‌‌గా ఉంటా. ఫేమ్ కంటే క్రాఫ్ట్ ముఖ్యం. ఈ16 ఏళ్ల సాధన తర్వాత వచ్చిన సక్సెస్ ఎన్నో పాఠాలు నేర్పించింది. ప్రాసెస్‌‌‌‌ను ట్రస్ట్ చేయాలి. వేగంగా జరగకపోయినా ఓపిక పట్టాలి. 

పదహారేండ్ల నిరీక్షణ

చాలామంది యాక్టర్స్​లాగే దానిష్‌‌‌‌కు కూడా అవకాశాలు అంత సులభంగా రాలేదు. 2008 నుంచి 2024 వరకు ఆయన కెరీర్​లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ తనకు ఎప్పుడూ వెనకడుగు వేయాలనే ఆలోచనే రాలేదు. అలా మోడలింగ్​ నుంచి టెలివిజన్ ఇండస్ట్రీకి మారాడు. కెరీర్ ప్రారంభంలో ‘కిత్​నీ మొహబ్బత్ హై’ వంటి పాపులర్ సీరియల్స్‌‌‌‌లో నటించాడు.

ఆ తర్వాత ‘ఏజెంట్ రాఘవ్’, ‘ఇష్క్‌‌‌‌బాజ్’ వంటి షోలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన నటనను మెరుగుపరుచుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేశాడు. అయితే ‘‘ప్రతి రిజెక్షన్ నన్ను మరింత మొండిగా మార్చింది’’ అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

©️ VIL Media Pvt Ltd.