
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి వద్ద 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో 18 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వీరన్నగట్టుపల్లి సమీపంలో వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ వైర్లు ఒక్కసారిగా బస్సు టాప్ పై తగిలాయి. దీంతో బస్సులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి.
►ALSO READ | అనకాపల్లి జిల్లాలో దారుణం: ఆక్సిజన్ అందక నవజాత శిశివు మృతి
బస్సుపై మంటలను గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్.. వాహనాన్ని నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించేశారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి అంటుకోవడంతో.. బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.