Reading Time: < 1 minute

21 ఏళ్ల లోపు వాళ్లకు సిగరెట్స్ అమ్మితే రూ. 50 వేలు జరిమానా

Caption of Image.

జగిత్యాల జిల్లా  కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామ పంచాయతీ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని  సంచలన తీర్మానాన్ని ఆమోదించింది. పెరుగుతున్న వ్యసనాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా గ్రామంలోని 21 సంవత్సరాల లోపు యువతకు సిగరెట్లు విక్రయించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ గ్రామ పాలకమండలి కఠిన నిర్ణయం తీసుకుంది.

 ఎవరైనా షాపు యజమానులు 21 ఏళ్ల లోపు పిల్లలకు లేదా యువకులకు సిగరెట్లు విక్రయిస్తే.. వారికి ఏకంగా 50 వేల రూపాయల భారీ జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా, వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పాలకమండలి హెచ్చరించింది. యువతను పొగాకు మహమ్మారి నుండి కాపాడేందుకు ఈ కఠిన నిబంధనలు తప్పనిసరని గ్రామ పెద్దలు స్పష్టం చేశారు.

►ALSO READ | మాదాపూర్ లో స్కూటీని ఢీకొట్టి.. 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన డీసీఎం

ఈ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రజల సహకారాన్ని కూడా గ్రామ పంచాయతీ కోరింది. గ్రామంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా సిగరెట్లు అమ్ముతున్నట్లు గమనించి, వారిని పట్టించిన వారికి ప్రత్యేక బహుమతి అందజేస్తామని తీర్మానించింది. తద్వారా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తారని అభిప్రాయపడింది.  పిల్లల ఆరోగ్యం కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం బొమ్మెన గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.