
Pakistan: అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. ఇదిలా ఉంటే, ఇదే సమయంలో పాకిస్తాన్‌ను తమ అప్పు తీర్చాల్సిందిగా యునైడెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కోరింది. తమ డబ్బులు తిరిగి చెల్లించాల్సిందిగా ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఏప్రిల్‌లో మొత్తం 3.5 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధ నేపథ్యంలో యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇరాన్ దాడులతో యూఏఈ కూడా ఇబ్బందుల పాలవుతోంది. దుబాయ్, అబుదాబీలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో యూఏఈ తన రుణాన్ని త్వరగా తిరిగి పొందాలని భావిస్తోంది.
Read Also: Raakaasaa:సంగీత్ శోభన్ ఖాతాలో మరో హిట్? ‘రాకాస’ మొదటి రోజు వసూళ్లు ఇవే!
పాకిస్తాన్ యూఏఈకి ఇవ్వాల్సిన రుణ చెల్లింపులను షెడ్యూల్ చేసింది. ఏప్రిల్ 11న 450 మిలియన్ డాలర్లను, ఏప్రిల్ 17న 2 బిలియన్ డాలర్లను, ఏప్రిల్ 23న 1 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని నిర్ణయించుకుంది. ఇదే నెలలో 1.3 బిలియన్ డాలర్ల యూరోబాండ్ కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో ఏప్రిల్‌లో మొత్తంగా 4.8 బిలియన్ డాలర్లను పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 16.4 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇందులో మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, చైనా నుంచి వచ్చిన డిపాజిట్లే ఎక్కువ. ఈ వ్యవహారంపై ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. విదేశీ సాయంపై ఆధారపడాల్సి రావడం తనకు ఇబ్బందికరంగా ఉందని అన్నారు.
మరోవైపు, పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులు తీవ్రంగా పెరిగాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్తాన్ చమురు ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. మరోవైపు, దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. ఎగుమతులు 8 శాతం తగ్గాయి. విదేశీ పెట్టుబడులు తగ్గడంతో పాటు అంతర్జాతీయ ఒత్తిడి పెరిగింది. ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి 7 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకుంది. ఈ ప్రోగ్రాం కింద తీసుకునే ఆర్థిక క్షమశిక్షణ చర్యలతో పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.