
Hyderabad Drug Party Busted: హైదరాబాద్ నగర శివార్లలోని గోల్కొండ తారామతి బారాదరి పరిసరాల్లో ఉన్న ఓ రిసార్ట్‌లో శనివారం రాత్రి డ్రగ్స్ కలకలం రేగింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ టాస్క్ ఫోర్స్ బృందం, రిసార్ట్ లో జరుగుతున్న ‘జాక్ జాన్సన్’ ఈవెంట్ పై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో పలువురు ప్రముఖులు డ్రగ్స్ సేవించినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.
శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈగల్ టీం & టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. రిసార్ట్ లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఈవెంట్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. పార్టీలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయడమే కాకుండా, అనుమానితులకు అక్కడికక్కడే యూరిన్ డ్రగ్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు సాగిన ఈ తనిఖీల్లో ఇప్పటివరకు ఆరుగురికి గంజాయి, ఇతర డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ అని తేలింది.
ఈ డ్రగ్స్ పార్టీలో పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులు, ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నట్లు సమాచారం. సెలబ్రిటీల సమక్షంలో ఈ ఈవెంట్ జరుగుతుండటంతో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే డ్రగ్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
యూరిన్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి ఆదివారం మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నివేదికలు అందిన తర్వాత, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈ ఈవెంట్ వెనుక ఉన్న నిర్వాహకులు ఎవరు? డ్రగ్స్ ఎక్కడి నుండి సరఫరా అయ్యాయి? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.