
ఎగ్స్తో ఎన్నో రకాల వంటలు చేసి ఉంటారు. కానీ, ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..? ఈ రెసిపీలు చేయడానికి పది నిమిషాలు కూడా పట్టదు. కానీ, వీటి టేస్ట్ మాత్రం ప్రతిరోజూ తినాలనిపించేలా ఉంటుంది. ఎగ్ ఇష్టపడని వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మరింకేం ఈస్టర్ సందర్భంగా.. ఎగ్స్తో ఈ వెరైటీలు షురూ చేయండి.
పింక్ ఎగ్స్
- కావాల్సినవి: కోడిగుడ్లు – పది
- బీట్రూట్, ఊరబెట్టిన కీరదోస (జుకిని) – ఒక్కోటి
- వేడి నీళ్లు, ఉప్పు – సరిపడా
- వెనిగర్ – ఒక టేబుల్ స్పూన్
- ఆవాలు, నల్ల మిరియాల పొడి – ఒక్కో టీస్పూన్
- క్రీమ్ చీజ్ – రెండు టేబుల్ స్పూన్లు
- మస్టర్డ్ సాస్ – అర టీస్పూన్
- కొత్తిమీర – కొంచెం
తయారీ:
ఉడికించిన కోడిగుడ్లను తొక్క తీసి ఒక గిన్నెలో వేయాలి. అందులో బీట్రూట్ ముక్కలు, ఉప్పు, వెనిగర్ వేసి వేడినీళ్లు పోసి కాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత కోడిగుడ్లను నిలువుగా కట్ చేసి లోపల ఉన్న పచ్చసొనను వేరుచేయాలి. ఒక మిక్సీజార్‌లో పచ్చసొనలు, ఊరబెట్టిన కీరదోస తరుగు, క్రీమ్ చీజ్, ఉప్పు, నల్ల మిరియాల పొడి, మస్టర్డ్ సాస్ వేసి గ్రైండ్ చేయాలి. చివరగా ఎగ్ వైట్స్‌లో ఈ క్రీమ్‌ని పెట్టాలి. దానిపై కొత్తిమీర చల్లాలి.
ఎగ్ కలక్కి
- కావాల్సినవి: కోడిగుడ్లు – రెండు, ఉప్పు, కారం, మిరియాల పొడి – సరిపడా
- నూనె – రెండు టీస్పూన్లు, కొత్తిమీర – కొంచెం
తయారీ:
ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన, ఉప్పు, మిరియాల పొడి, కారం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. పాన్‌లో నూనె వేసి వేడి చేసి అందులో కోడిగుడ్ల మిశ్రమం పోయాలి. ఆమ్లెట్‌లా కాకుండా మడతపెడుతూ ఉడికించాలి. లోపల సొన కాస్త పచ్చిగా ఉండగానే తీసేయాలి. దీన్ని కావాలంటే ముందుగా కోడిగుడ్ల సొన వేసి ఉడికాక, దానిపై కారం, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు చల్లుకోవచ్చు.
ఎగ్ భేజొ
కావాల్సినవి:
- కోడిగుడ్లు – రెండు
- నూనె, ఉప్పు – సరిపడా
- ఉల్లిగడ్డ తరుగు – ఒక కప్పు
- వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
- ఎండుమిర్చి – పది
- ఉప్పు నీళ్లు, లెమన్ వాటర్, చింతపండు రసం, నూనె – ఒక్కోటి పావు టీస్పూన్
తయారీ:
పాన్‌లో నూనె వేడి చేసి అందులో ఉల్లిగడ్డ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేగించాలి. వాటిని ఒక ప్లేట్లోకి తీశాక, అందులో వెల్లుల్లి తరుగు, ఎండు మిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించి పక్కన పెట్టాలి. తర్వాత మిక్సీజార్‌లో ఎండు మిర్చి వేసి గ్రైండ్ చేయాలి. ఆ పొడిని ఒక గిన్నెలో వేసి అందులో వేగించిన ఉల్లిగడ్డ, వెల్లుల్లి తరుగు వేసి చేత్తో నలుపుతూ బాగా కలపాలి.
ఉడికించిన కోడిగుడ్లను తొక్క తీసి, నిలువుగా కట్ చేయాలి. దాని మధ్యలో ఉల్లిగడ్డ, వెల్లుల్లి మిశ్రమం పెట్టాలి. దానిపై ఉప్పునీళ్లు, లెమన్ వాటర్, చింతపండు రసం, నూనె ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున వేయాలి. ఆపై కొత్తిమీర చల్లాలి.