
కమలనాథులు చురుగ్గా పాల్గొనాలి
ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడాలి
పార్టీ చీఫ్ రాంచందర్ రావు పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం (6న) పార్టీ శ్రేణులు పార్టీ నిర్దేశించిన వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, ఇంటి యజమాని అనుమతితో వారి ఇంటిపై పార్టీ జెండా ఎగుర వేయాలని ఆయన సూచించారు. దీంతో జాతీయ గౌరవ భావన, ప్రజా భాగస్వామ్యం, పార్టీ పట్ల ప్రజల ఆత్మీయ అనుబంధం మరింత బలపడుతోంది. అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి ఎంతో సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకోనున్నారని ఆయన చెప్పారు. వేడుకలకు ముందు రోజే ప్రతి బూత్‌లో, ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు ఇప్పటికే పార్టీ జెండాను ఆవిష్కరించడం ప్రారంభించి, పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం సంతోషకరమని అన్నారు.
బిజెపి కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని జాతీయ సేవ, జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అని పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త దేశం ముందు – పార్టీ తరువాత – స్వయం చివర అనే భావంతో, పార్టీ సిద్ధాంతాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఆరు సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తమ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలవడం మనందరికీ గర్వకారణం అని ఆయన వివరించారు. గతంలో జనసంఘ్‌గా ప్రారంభమైన ఈ ప్రయాణం, 1980లో ముంబైలో అటల్ బిహారీ వాజపేయి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుని, తన సిద్ధాంత బలం, క్రమశిక్షణ గల కార్యకర్తల శ్రమ, జాతీయ సేవ పట్ల అచంచల నిబద్ధతతో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని రాంచందర్ రావు వివరించారు.
దేశంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చామని, అంతేకాక, రాబోయే కాలంలో కూడా మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రులైన తర్వాతనే భారత్ నిజమైన ఆర్థిక మార్పును, అభివృద్ధి యొక్క కొత్త యుగాన్ని చూడడం ప్రారంభించిందని ఆయన వివరించారు. వారిరువురి నాయకత్వం దేశానికి కొత్త దిశను చూపి, అభివృద్ధిని వేగవంతం చేసి, మరింత బలమైన, ఆత్మనిర్భరమైన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి పునాది వేసిందని రాంచందర్ రావు తెలిపారు.