
ఆకాశంలో సెకనుకు వందల మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఫైటర్ జెట్.. ఒక్కసారిగా శత్రువుల క్షిపణి తగిలి నిప్పుల ముద్దలా మారిపోతే? మరుక్షణమే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారాచూట్ సహాయంతో శత్రువుల ఇలాకాలో దిగాల్సి వస్తే? ఆ ఊహే ఎంత భయంకరంగా ఉందో కదా. ప్రస్తుతం ఇరాన్ గగనతలంలో అదృశ్యమైన అమెరికా యుద్ధ విమాన పైలట్ పరిస్థితి ఇదే. శత్రువుల కళ్లు గప్పి, ప్రాణాలతో బయటపడటం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. దీని వెనుక అత్యంత కఠినమైన శిక్షణ, చాకచక్యంతో పాటు ప్రాణాలకు తెగించే రెస్క్యూ టీమ్స్ పోరాటం ఉంటుంది. రిటైర్డ్ బ్రిగేడియర్ జనరల్ హ్యూస్టన్ కాంట్‌వెల్, బ్లాక్ హాక్ డౌన్ ఫేమ్ స్కాట్ ఫేల్స్ వంటి నిపుణులు ఇలాంటి పరిస్థితులతో ఫైటర్ పైలట్ పోరాడటం ఎలా ఉంటుందో వివరించారు.
ఒక పైలట్ ఫైటర్ జెట్ నుంచి ఎజెక్ట్ అయినప్పుడు.. రెండు నిమిషాల క్రితం వరకు 500 మైళ్ల వేగంతో ఎగురుతున్న వ్యక్తి, అకస్మాత్తుగా పారాచూట్ ద్వారా కిందకు వస్తూ మృత్యువును దగ్గరగా చూస్తాడు. పారాచూట్ కిందకు వస్తున్నప్పుడే ఆ పైలట్ తన చుట్టుపక్కల ప్రాంతాన్ని గమనించాలి. ఎక్కడ దాక్కోవాలి? ఎక్కడ శత్రువులు ఉన్నారు? అనేది ఆ కొద్ది సెకన్లలోనే నిర్ణయించుకోవాలి. భూమిపై దిగగానే కాళ్లు విరగడం, తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేలపై పడగానే ముందుగా తన శరీరం కదలడానికి సహకరిస్తుందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాతే అసలైన సర్వైవల్ పోరాటం మొదలవుతుంది. శత్రువుకు చిక్కకుండా రహస్యంగా కమ్యూనికేట్ చేయడం, ఎడారి వంటి ప్రాంతం అయితే నీటిని వెతుక్కోవడం ముఖ్యం.
పైలట్ కింద పడగానే సెర్చ్ అండ్ సెర్క్యూ టీమ్స్ వెంటనే అలెర్ట్ అవుతాయి. అత్యాధునిక డ్రోన్లు, సిగ్నల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ చిత్రాల ద్వారా పైలట్ ఎక్కడున్నాడో గాలిస్తారు. పైలట్ తనను తాను దాచుకుంటూనే.. రెస్క్యూ టీమ్‌కు తన లొకేషన్ తెలిసేలా ప్రయత్నించాలి. నగర ప్రాంతం అయితే భవనాల పైకప్పులు, గ్రామీణ ప్రాంతం అయితే హెలికాప్టర్ దిగడానికి వీలైన ఖాళీ ప్రదేశాలకు రాత్రిపూట మాత్రమే కదలాలి. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకున్నాక.. అది అసలు తమ పైలట్టేనా కాదా అని నిర్ధారించుకుని, శత్రువుల ముప్పు ఎంత ఉంది? పైలట్ గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి? అనే దానిపై సెకన్ల వ్యవధిలో నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి మెరుపు వేగంతో మాయమవ్వాలి.
ప్రస్తుతం ఇరాన్ నైరుతి ప్రాంతంలో గాలిస్తున్న అమెరికా దళాలకు సమయం తక్కువగా ఉంది. ఇరాన్ సైన్యం ఆ పైలట్ కోసం వేట కొనసాగిస్తుంటే, అమెరికా రెస్క్యూ టీమ్స్ తమ సహచరుడిని ప్రాణాలతో తీసుకురావడానికి పోరాడుతున్నాయి. “మా పైలట్‌ను స్థానిక స్నేహపూర్వక వ్యక్తులు ఎవరైనా దాచి ఉంచి ఉంటారని లేదా అతను శత్రువులకు దొరక్కుండా తప్పించుకుంటున్నాడని ఆశిస్తున్నాం” అని స్కాట్ ఫేల్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిమిషం ఒక యుగంలా గడుస్తున్న ఈ ఆపరేషన్, యుద్ధ రంగంలో పైలట్ల ధైర్యానికి, రెస్క్యూ టీమ్స్ అంకితభావానికి ఒక పెద్ద పరీక్ష.