Reading Time: 2 minutes

స్పెషల్ ఫోర్సెస్, భారీ యుద్ధ విన్యాసాలతో అమెరికా ఆపరేషన్

న్యూఢిల్లీ: ఇరాన్‌లో కూలిన ఎఫ్-15 యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన సాహసోపేత ఆపరేషన్‌పై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వి గాట్‌హిమ్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, వందల సంఖ్యలో ప్రత్యేక దళాలు పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చివేయడంతో, అందులో ఉన్న ఇద్దరు సిబ్బందిలో పైలట్‌ను తక్షణమే రక్షించారు. అయితే వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో అతని కోసం అమెరికా విసృ్తత శోధనను ప్రారంభించింది. రెండో రోజు రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ మరుసటి రోజు ఉదయం ముగిసింది. అమెరికా సైన్యం ఈ ఆపరేషన్‌లో అత్యాధునిక యుద్ధ సామగ్రిని వినియోగించింది. హెచ్‌హెచ్-60 డబ్ల్యూ‘జాలీ గ్రీన్ II’ రక్షణ హెలికాప్టర్లు, ఎ-10 వార్థాగ్ దాడి విమానాలు, హెచ్‌సి-130 మిడ్‌ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 స్టెల్త్ జెట్స్‌తో పాటు ప్రత్యేక ‘కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ దళాలు పాల్గొన్నాయి. శత్రు భూభాగంలో మిసైల్, రాడార్ ముప్పు మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం.

మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం, విమానం కూలిన వెంటనే ఇద్దరు సిబ్బంది తమ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వారి స్థానాన్ని తెలియజేశారు. అమెరికా సైన్యం మొదటి పైలట్‌ను రక్షించగా, రెండో పైలట్ కోసం సీఐఏ ప్రత్యేక వ్యూహంతో శోధన చేపట్టింది. శత్రువులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, అసలు స్థానం గోప్యంగా ఉంచింది. ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే ప్రత్యేక దళాలను ప్రవేశపెట్టి, తీవ్ర కాల్పుల మధ్య హెలికాప్టర్ల సహాయంతో రెండో పైలట్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్‌లో కొంత ప్రతిఘటన ఎదురైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ బలగాలు దాడి చేయడానికి ప్రయత్నించగా, అమెరికా యుద్ధవిమానాలు బాంబులు విసురుతూ, కాల్పులు జరిపి శత్రువులను దూరంగా ఉంచాయి. ఈ చర్యల మధ్యే రక్షణ కార్యాచరణ విజయవంతమైంది. రక్షించిన సిబ్బంది గాయపడినప్పటికీ ప్రాణాపాయం లేదని ట్రంప్ తెలిపారు. రెండో పైలట్‌ను గౌరవనీయ కల్నల్ అని పేర్కొంటూ, శత్రు ప్రాంతంలో ఉన్నప్పటికీ అతను ఒంటరిగా లేడు. 24 గంటలూ అతని కదలికలను మేము పర్యవేక్షించాం అని అన్నారు. అదేవిధంగా, రెండు వేర్వేరు సందర్భాల్లో శత్రు భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను విజయవంతంగా రక్షించడం సైనిక చరిత్రలో అరుదైన ఘటనగా ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ ప్రతిస్పందన

మరోవైపు ఈ ఆపరేషన్‌పై ఇరాన్ విభిన్న వాదనలు చేసింది. అమెరికా రక్షణ చర్య విఫలమైందని, తమ బలగాలు ఒక సి-130 రవాణా విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని, కొందరు మరణించారని కూడా ఇరాన్ ఆరోపించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా తన వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్ తీవ్ర ప్రతిదాడులకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఇంధన రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది.