Reading Time: < 1 minute

సినిమా ఇంకా ఉందని వీడియోలతో ఎదురుదాడి

న్యూఢిల్లీ:  పంజాబ్ వేదికగా ఆమ్ ఆద్మీపార్టీలో సంక్షోభం ముదిరింది. ఆప్ రాజ్యసభ సభ్యులు ఎంపి రాఘవ చద్ధా ఆదివారం పార్టీ నాయకత్వంపై ఎదురుదాడికి దిగారు. సినిమా అయిపోలేదు. ఇంకా మిగిలే ఉంది. పైగా ఇప్పుడే అసలు సినిమా అంటూ వీడియోలు విడుదల చేశారు. పార్లమెంట్‌లో పంజాబ్ సమస్యలను రాఘవ ప్రస్తావించడం లేదనే పార్టీ అంతర్గత వాదనను ఆయన తోసిపుచ్చారు. పార్లమెంట్‌లో తన ప్రసంగాలను తెలియచేస్తూ తాజాగా మూడు నిమిషాల వీడియోను వెలువరించారు. నిజానిజాలు ఈ దృశ్య శ్రవణ సాధనాలు తెలియచేస్తామని స్పందించారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో తప్పుడు కథలతో ప్రచారానికి దిగుతున్నారని, దీనికి తాను ప్రతిస్పందన ఇచ్చుకోవల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యసభలో ఆప్ ఉపనేత పదవి నుంచి ఇటీవల ఆయనను తొలిగించారు. ఇది వివాదాస్పదం అయింది. పంజాబ్ విషయాలను తాను ప్రస్తావించడం లేదని చెప్పడం కించపర్చడమే అని పేర్కొన్నారు. పంజాబ్ తనకు ఓ మైక్ అనుకోరాదని, అంతకు మించి ఓ ఇల్లు, తన ఆత్మ అని తెలిపిన రాఘవ పంజాబ్ కోసం స్పందించడం తన బాద్యత అని తేల్చిచెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరలు, భగత్ సింగ్‌కు భారత్ రత్న, భూగర్భ జలాల తగ్గుముఖం, నన్‌కానా సాహిబ్ కారిడార్ వంటి విషయాలపై మాట్లాడానని తెలిపారు. సంబంధిత వీడియోలు అందరి ముందుంచుతున్నాను మిత్రమా అని సవాలు విసిరారు. పంజాబ్ ఎమ్మెల్యేలు ఎన్నుకోవడం వల్లనే రాజ్యసభకు చద్థా వెళ్లారని, అయితే ఆయన పల్లెతు మాట కూడా పంజాబ్ కోసం మాట్లాడటం లేదని పంజాబ్‌లోని ఆప్ నాయకత్వం విమర్శిస్తోంది. ఆయన మౌనం దేనికి సంకేతం అని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా, ఆప్ పంజాబ్ విభాగం అధ్యక్షులు అమన్ ఆరోరా , సీనియర్ నేత కుల్దీప్ సింగ్ ధాలీవాల్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు గౌరవప్రదంగానే రాఘవ కౌంటర్ ఇచ్చారు.