Reading Time: < 1 minute

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన ముంబై జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. 3వ ఓవర్‌లోనే ముఖేష్ కుమార్ రికెల్టన్(9), తిలక్ వర్మ(0)లను పెవిలియన్ పంపించాడు. ఈ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యం జత చేశాడు. వీరిద్దరు కలిసి 53 పరుగుల స్కోర్‌ని జోడించారు.

అయితే ఈ భాగస్వామ్యానికి అక్షర్ బ్రేక్ వేశాడు. అక్షర్ బౌలింగ్‌లో రోహిత్(35) ఔట్ అయ్యాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేశాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సులతో 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నమన్ ధిర్ 28 పరుగులు చేసి ఫర్వాలేదు అనిపించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్‌లో ముఖేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్, విప్రాజ్, నటరాజన్ తలో వికెట్ తీశారు.