
మహ్మద్ షమీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నిప్పులు చెరుగుతూ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న ఆయన, సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయిన అభిషేక్ శర్మను డకౌట్ చేసి, ట్రావిస్ హెడ్‌ను తక్కువ స్కోర్‌కే పెవిలియన్కు పంపించాడు. మ్యాచ్ అనంతరం షమీ తన ప్రదర్శనపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
“నేను ఒక యంత్రాన్ని కాదు. నా ఆట తీరు సీజన్‌ను బట్టి మారుతూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా నేను మంచి ప్రదర్శన ఇస్తున్నాను, కానీ జనం దానిని గమనించలేదు. ఏది ఏమైనా, నేను ఎప్పుడూ నా శక్తినంతా ధారపోస్తాను” అని షమీ తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆయన కేవలం వికెట్లు తీయడమే కాకుండా, ఏకంగా 16 డాట్ బాల్స్ వేసి హైదరాబాద్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు.
Also Read:RCB Vs CSK: చిన్నస్వామిలో RCB సిక్సర్ల సునామీ.. టిమ్ డేవిడ్ వీరవిహారం.. స్కోర్ ఎంతంటే..
డాట్ బాల్స్ వేయడం అనేది మన సన్నద్ధత, దానిని అమలు చేసే తీరుపై ఆధారపడి ఉంటుందని షమీ చెప్పాడు. “హైదరాబాద్ బ్యాటర్లకు వేగం తగ్గించి (Pace off) బంతులు వేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నాకు తెలుసు, అందుకే అదే వ్యూహాన్ని అనుసరించాను” అని ఆయన వివరించాడు. కొత్త బంతితో వికెట్లు తీయడం తన బలం అని, తొలి మూడు ఓవర్లు బాగా పడితే నాలుగో ఓవర్‌ను కూడా వెంటనే పూర్తి చేయడం తన పద్ధతి అని షమీ పేర్కొన్నాడు.
తన పాత జట్టుపై, తెలిసిన మైదానంలో ఆడటం గురించి అడగ్గా.. “నాకు మొత్తం భారతదేశమే లోకల్. ఎక్కడ పిచ్ ఎలా ఉంటుంది, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఏ జట్టుపై ఏ వ్యూహం వాడాలో తెలియడం చాలా ముఖ్యం” అని సమాధానమిచ్చాడు. భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మార్గదర్శకత్వంలో పకడ్బందీ ప్రణాళికతోనే తాను ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్‌పై రాణించగలిగానని షమీ క్రెడిట్ ఇచ్చాడు. 35 ఏళ్ల వయసులో కూడా షమీ తన అనుభవంతో యువ ఆటగాళ్లకు సవాల్ విసురుతున్నాడు.