Reading Time: 2 minutes

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళి

మన తెలంగాణ / హైదరాబాద్ : అణగారిన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ జయంతి రోజున జరుపుకునే సమతా దివస్ సందర్భంగా, సమాజంలోని వివక్షతకు వ్యతిరేకంగా సమానత్వం, ఐక్యత, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషి ని సిఎం కొనియాడు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, దళితుల హక్కుల కోసం వారు జీవితాంతం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. బాబూజీ స్పూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.

సాంఘీక న్యాయయోధుడు జగ్జీవన్ రామ్ : గవర్నర్ నివాళి

బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగజీవన్ రామ్ ఒక మహోన్నత జాతీయ నాయకుడని, స్వాతంత్య్ర సమరయోధుడని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సాంఘిక న్యాయ యోధుడని ఆయన అభివర్ణించారు. సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధత ప్రగతిశీల భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో దోహదపడిందని కొనియాడారు. న్యాయమైన, సమ్మిళిత, సమాజాన్ని నిర్మించడానికి తరతరాలకు స్ఫూర్తినిస్తూ, ఆయన వారసత్వం శాశ్వతంగా నిలిచిపోవాలని గవర్నర్ ఆకాక్షించారు.

జగ్జీవన్‌రామ్ జీవితం మనందరికీ స్పూర్తిదాయకం : వివేక్

బాబు జగ్జీవన్‌రామ్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు అపారమైనవని కొనియాడారు. ఇందిరా గాంధీ కేబినెట్‌లో కేంద్ర వ్యవసాయ మంత్రిగా కూడా ఆయన అద్భుతమైన సేవలు అందించారని, ఆయన స్ఫూర్తితో మనమందరం ముందుకు సాగుదామని అన్నారు.

బిసి కమిషన్ ఘన నివాళి

బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాన్ని తెలంగాణ బిసి కమిషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బిసి కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాల లక్ష్మి ఇతర అధికారులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ జి.నిరంజన్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ భారతదేశానికి, బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసారని, ఆయన కూతురు మీరా కుమారి లోక్ సభ స్పీకర్ గా ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషి చేశారని తెలిపారు.

ఆర్‌టిసి బస్ భవన్ లో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు‘

ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆజన్మాంతం పని చేసిన ధీరుడు, భారత మాజి ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ అని ఆర్‌టిసి అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం సంస్థ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబుజీ చేసిన కృషి చిరస్మరణీయమని ఈ సందర్భంగా ఆర్‌టిసి ఈడి సిహెచ్ .వెంకన్న అన్నారు. అధికారులు, సిబ్బంది బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

గాంధీ భవన్‌లో జగ్జీవన్‌రామ్ జయంతి

బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు, కాంగ్రెస్ నేతలు కుమారరావు, మెట్టు సాయికుమార్, జగదీశ్వరరావు, సురేష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.