
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల అవసరమవుతాయని అధికారులు తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు.
సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ సూచించారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్‌లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని… పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని… ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు.
ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.