Reading Time: 2 minutes

అతిథిని గౌరవిస్తే లాభమేంటి.. కొంగ, నక్కబావ కథ ఏం చెప్తోంది..?

Caption of Image.

తల్లిదండ్రులను, గురువులను.. ఆ తరువాత అతిథిని దైవంగా భావించమని భారతీయ సనాతన ధర్మం చెబుతోంది. మన ఇంటికి వచ్చిన అతిథిని ఎంతో గౌరవంగా ఆదరించడం సంప్రదాయంగా వస్తోంది. కొందరికైతే… ఎవరో ఒక అతిథికి అన్నం పెట్టకుండా భోజనం చేయకూడదనే నియమం కూడా ఉండేది. ఇందుకు ఉదాహరణ సక్తుప్రస్తుడి కథ. మహాభారతంలోని సక్తుప్రస్తుడి కథ నీతిని బోధిస్తుంది. సక్తుప్రస్తుడు నిరుపేద బ్రాహ్మణుడు. 

ఆ ఇంట్లో సక్తుప్రస్తుడు, భార్య, కొడుకు, కోడలు.. నలుగురు జీవిస్తున్నారు. వారు పస్తులు ఉన్నప్పటికీ, ఆకలితో వచ్చిన అతిథికి మాత్రం ఏదో ఒక విధంగా ఆహారం పెట్టేవారు. ఒక్కోసారి వారు తింటున్న ఆహారం కూడా ఇచ్చేసేవారు. వారంతా నిస్వార్థ త్యాగానికి నిదర్శనంగా ఉండేవారు. ఎంత ఆకలితో ఉన్నప్పటికీ ధర్మాన్ని అతిక్రమించేవారు కాదు. దొరికిన కొద్దిపాటి ధాన్యంతో కడుపు నింపుకునేవారు. ఒకరోజు వారికి చాలా తక్కువ గింజలు దొరికాయి. ఆ గింజలను పిండి (సక్తు) చేసి, నాలుగు సమాన భాగాలుగా పంచుకుని తినబోయారు. సరిగ్గా అదే సమయంలో ఒక వృద్ధుడు ఆకలితో వారి ఇంటికి వచ్చాడు.  

వయసులో వారందరి కంటే పెద్దవాడైన ఆ వృద్ధుడి ఆకలిని గమనించిన సక్తుప్రస్తుడు, తన ఆహారాన్ని అతనికి ఇచ్చాడు. ఆ వృద్ధుడికి ఆకలి తీరలేదు. అప్పుడు సక్తుప్రస్తుని భార్య తన భాగాన్ని ఇచ్చేసింది. ఆ వృద్ధుడికి ఇంకా ఆకలి తీరలేదు. అప్పుడు కొడుకు, కోడలు కూడా వారి వారి భాగాలను ఆ వృద్ధుడికి ఇచ్చేశారు. వారి త్యాగానికి వృద్ధుని రూపంలో ఉన్న ధర్మదేవత సంతోషించి, ప్రత్యక్షమై, వారిని ఆశీర్వదించింది.

 ఆ పేద బ్రాహ్మణుడు జొన్నపిండిని దానం చేసిన సమయంలో గాలికి ఎగిరి కొంత నేలపై పడింది. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఒక ముంగిస ఆ పిండిలో దొర్లింది. అలా దొర్లిన భాగం బంగారంగా మారిపోయింది. మళ్లీ అంత గొప్ప దానం చేసే వ్యక్తి కోసం ఎదురుచూసింది ముంగిస. కాని దానికి అంతటి దానగుణం కలిగిన వ్యక్తి కనపడలేదని భారతం చెబుతోంది.

అనగనగా ఒక అడవిలో ఒక కొంగ, ఒక నక్క ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఒకసారి కొంగను నక్క తన ఇంటికి విందుకి ఆహ్వానించింది. కొంగ ఎంతో సంబరంగా నక్క ఇంటికి బయలుదేరింది. దారిలో ఉన్నంతసేపు నక్క అందించబోయే విందును తలచుకుంటూ నోరూరుతుండగా నక్క ఇంటికి చేరింది. నక్క రెండు పళ్లాలు తీసుకొచ్చి, అందులో పాయసం పోసి, ఒక పళ్లెం తన ముందు, ఒక పళ్లెం కొంగ ముందు ఉంచింది. కొంగ ముక్కు పొడవుగా ఉండటంతో పాయసం తినలేకపోయింది. 

నక్క మాత్రం గబగబా మొత్తం తినేసింది. తనను అవమానించడానికే నక్క తనను ఇంటికి పిలిచిందని అర్థం చేసుకుంది. మారుమాట్లాడకుండా, ఆకలితోనే తన ఇంటికి చేరుకుంది కొంగ. వారం రోజుల తరువాత నక్కను తన ఇంటికి ఆహ్వానించింది కొంగ. నక్క నోరూర్చుకుంటూ కొంగ ఇంటికి చేరింది. నక్క చేసిన అవమానం తాను చేయకూడదని, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవంగా చూసి పంపించాలని భావించింది కొంగ. రకరకాల వంటకాలతో విందు సిద్ధం చేసింది. నక్క ముందు ఒక పెద్ద పళ్లెం ఉంచి, అందులో రకరకాల పదార్థాలు వడ్డించి, ‘నక్క బావా! నీకు నచ్చిన పదార్థాలను కడుపునిండుగా తిను. మళ్లీ కావాలంటే కూడా అడుగు.వడ్డిస్తాను’ అంది. 

కొంగ చేసిన ఏర్పాట్లు, కొంగ మాట తీరు చూసి నక్క సిగ్గుతో తల దించుకుంది. తన తప్పు తెలుసుకుంది. ఇంటికి ఆహ్వానించిన అతిథికి కావలసిన విధంగా ఆహారం అందించాలని అర్థం చేసుకుంది. మరోమారు కొంగను తన ఇంటికి ఆహ్వానించి, పొడవాటి పాత్రలలో పదార్థాలను వడ్డించింది. గతంలో తను చేసిన తప్పును క్షమించమంది. అలా తాను చేసిన పొరపాటును సరిదిద్దుకుంది నక్క. 
ఇంటికి వచ్చిన శత్రువునైనా అతిథిగా భావించి, ఆకలి తీర్చాలని, ఆదరించి పంపాలని భారతీయ సంప్రదాయం చెబుతోంది.  

– డా. పురాణపండ వైజయంతి

©️ VIL Media Pvt Ltd.