Reading Time: < 1 minute
కన్న తల్లిపై కనికరం లేకుండా.. ఆసుపత్రిలో ఉన్నా చూడని కొడుకులు

అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదనే నానుడి నిజమవుతోంది. నవ మాసాలు మోసి కనిపించిన తల్లికి వృద్ధాప్యంలో ఆసరాగా ఉండాల్సిన కొందరు కొడుకులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆస్తిపాస్తులు తీసుకుని, కన్న తల్లికి కనీస వసతులు కల్పించకుండా, అనారోగ్యంతో ఉన్నా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఆసుపత్రిలో కదలేని స్థితిలో ఉన్న తల్లిపై కొడుకుల మనసు కరగడం లేదు.

సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరం గ్రామానికి చెందిన నల్లగంతుల వెంకమ్మ, రామచంద్రం దంపతులకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాయకష్టం చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు.

తండ్రి పేరిట ఉన్న భూమిని ముగ్గురు కొడుకులు 1.03 ఎకరాల చొప్పున పంచుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల క్రితం భర్త రామచంద్ర మృతి చెందాడు. కొడుకులు సరిగా చూసుకోకపోవడంతో సూర్యాపేట ఆర్డిఓ కు ఫిర్యాదు చేసింది వెంకమ్మ. పేరంటల్ యాక్ట్ ప్రకారం వృద్ధురాలు వెంకమ్మ పోషణకు నెలకు ఒక్క కుమారుడు 1500 రూపాయలు ఆమె ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. అయినా కొడుకులు పట్టించుకోకపోవడంతో వెంకమ్మ.. కూతురు లింగమ్మ వద్ద ఉంటోంది.

ప్రస్తుతం 95 ఏళ్లవయసులో ఉన్న వెంకమ్మ అనారోగ్యానికి గురై తల్లడిల్లుతోంది. వెంకమ్మ ఇటీవల ప్రమాదవశాత్తు పడిపోయి తుంటి ఎముక విరగడంతో కుమార్తె సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆసుపత్రిలో కదల్లేని స్థితిలో ఉన్నా కూడా వెంకమ్మను కుమారులు పట్టించుకోవడం లేదు. వెంకమ్మ తరఫున కుమార్తె లింగమ్మ గత నెలలో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి కుమారుల నుంచి ఖర్చులకు డబ్బులు ఇప్పించాలని వెంకమ్మ వేడుకుంటోంది. జీవిత చరమాంకంలో ఉన్న తల్లిని పట్టించుకోకపోవడంతో కొడుకులను జనం ఈసడించుకుంటున్నారు.