
రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కన్న కొడుకులు తండ్రిని చంపిన ఘటన కలకలం రేపింది. రేగొండ మండలం రేపాక గ్రామంలో తండ్రి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా కన్న కొడుకులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కోపం కట్టలు తెంచుకుని కన్న తండ్రిపై విచక్షణా రహితంగా ఇద్దరు కొడుకులు దాడి చేశారు. కన్న కొడుకులు గొడ్డలితో దాడి చేయడంతో కుర్రె చేరాలు అనే 45 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణం పోయింది. కొడుకులు రామ్ లక్ష్మణ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి కన్న తల్లికి ద్రోహం చేస్తున్నాడని కోపం పెంచుకున్న కొడుకులు ఇద్దరూ కన్న తండ్రిపై ఇలా దాడి చేసి చంపేశారు. ఈ వివాహేతర సంబంధాల మోజులో కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే విషయం.
ప్రపంచంలోనే భారతీయ వివాహ బంధానికి ఎంతో గొప్ప పేరు ఉంది. ఇతర దేశాలతో పోల్చుకుంటే.. పెండ్లి తంతు కూడా ఎంతో ఆర్భాటంగా ఉంటుంది. ఒక్కసారి వివాహ బంధంతో ఒక్కటైన జంట విడిపోవడం చాలా అరుదు. ఎంతో పెద్ద సమస్య వస్తే తప్ప విడాకులు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. భర్తను భార్య గౌరవిస్తూ.. భార్యను భర్త గౌరవిస్తూ.. సంసార జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా తట్టుకొని.. పిల్లలను ప్రయోజకులను చేసి.. వారికి పెండ్లి చేసేవరకు అలుపెరగకుండా కష్ట పడుతూనే ఉండడం భారతీయ సంస్కృతిలో ఒక ప్రధాన భాగం.
కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంతో కీర్తిగడించిన భారతీయ వైవాహిక బంధం కూడా మసకబారుతోంది. నేటితరం యువత దాంపత్య బంధానికి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తమకు నచ్చిన రీతిలో బతకాలని కోరుకుంటున్నారు. నచ్చిన రీతిన బతకడం తప్పుకాదు, కానీ అది అక్రమ సంబంధాలు, హత్యల దాకా దారితీయడమే సమస్య.