
రహదారి భద్రతను పెంపొందించడంలో భాగంగా, వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడే ప్రమాదకర ధోరణిని అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరం అంతటా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లు వాడుతున్న 308 మంది వాహనదారులను పోలీసులు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 262 మంది ద్విచక్ర వాహనదారులు, ముగ్గురు ఆటో, రిక్షాలు నడిపే వారు, 43 మంది కార్లు, ఇతర భారీ వాహనాలు నడిపే వారు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో వాహనదారులకు పోలీసులకు కీలక సూచనలు జారీ చేశారు. వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించడం అనేది తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘన మాత్రమే కాకుండా, వాహనదారుడితో పాటు ఇతర రహదారి వినియోగదారుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తుందని.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది, స్పందించే సమయం తగ్గుతుందని తెలిపారు.అలాగే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఎక్కవగా ఉందని సూచిస్తున్నారు. అందుకే ఎవరూ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడవద్దని పోలీసులు కోరుతున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉల్లంఘనల పట్ల ‘జీరో టోలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెబుతున్నారు. ప్రజలందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోరుతున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగాన్ని విస్మరించి, మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.