Reading Time: < 1 minute

వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని డిమాండ్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో ఆయన చేసిన ఘాటు, అసభ్య పదజాలం కూడా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్, మంగళవారం కీలక దశగా మారవచ్చు అని పేర్కొంటూ, ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై విసృ్తత స్థాయి దాడులు జరగవచ్చని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో పాటు ఇరాన్‌పై నేరుగా దూషణలు చేయడం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మూజ్ జలసంధి ఇటీవల ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా మారింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు, వాయువు సరఫరాలో గణనీయమైన భాగం రవాణా అవుతుంది. ప్రస్తుతం ఈ జలసంధిలో రవాణా తీవ్రంగా అంతరాయం ఎదుర్కొంటుండటంతో గ్లోబల్ మార్కెట్లపై ప్రభావం పడుతోంది.

ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మాత్రమే కాకుండా దౌత్య పరంగా కూడా తీవ్ర ప్రతిస్పందనలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికే అమెరికా హెచ్చరికలకు కఠినంగా స్పందిస్తుండగా, ఈ తాజా వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.