
ఆటోకు గ్యాస్ దొరకడం లేదంటూ ఓ వ్యక్తి రేడియో టవర్ ఎక్కిన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. టవర్ ఎక్కడమే కాకుండా 100 నెంబర్ కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. కిందికి దించే ప్రయత్నం చేసిన పోలీసులకు.. సీఎంతో మాట్లాడేదాక కిందికి దిగేదే లేదని కండిషన్ పెట్టడంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
2026 ఏప్రిల్ 04 (శనివారం) మధ్యాహ్నం హైదరాబాద్ చింతల్ కుంట రేడియో (ప్రసారం భారతి ) టవర్ దగ్గర జరిగింది ఈ ఘటన. రేడియో టవర్ ఎక్కాను.. ఆత్మహత్య చేసుకుంటానని జానీ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కాపాడే ప్రయత్నం చేశారు.
పోలీసులు టవర్ ఎక్కితే దూకేస్తానని బెదిరించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఆటోకు గ్యాస్ దొరకడం లేదు.. ఎలా నడపాలి.. సీఎంతో మాట్లాడిస్తేనే దిగుతానని పట్టుబట్టాడు. ఘటన స్థలానికి వనస్థలిపురం పోలీసులతో పాటు హైడ్రా, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. జానీకి నచ్చజెప్పి కిందికి దంచే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తి టవర్ ఎక్కాడన్న వార్త తెలిసి భారీగా జనాలు చేరుకున్నారు. దీంతో అక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయ్యింది.