
సినీ నటి ఎల్. విజయలక్ష్మి భారతీయ సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసిన అద్భుత నాట్య మయూరం. ఆమెను లక్ష్మణ్ విజయలక్ష్మి అనే పేరు వినగానే వెంటనే గుర్తుపట్టకపోయినా.. ఎల్. విజయలక్ష్మి అంటే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో ఆమె చేసిన నృత్య ప్రదర్శనలు గుర్తుకు వస్తాయి. కేరళకు చెందిన ఈ అందాల తార సుమారు 100కు పైగా సినిమాల్లో నటించి, తన నాట్య వేగంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆమె సినీ రంగంలో ప్రవేశించే నాటికి పద్మిని సోదరీమణులు, వైజయంతిమాల లాంటి టాప్ స్టార్స్ ఉన్నప్పటికీ, ఎల్. విజయలక్ష్మి తనదైన శైలితో తిరిగిలేని డాన్సర్ గా పేరుపొందారు. ఆమె డాన్స్ మూవ్స్ ఎంత వేగంగా ఉండేవంటే, అది ఒక మెరుపు లాగా సాగేది. తెలుగులో భక్తప్రహ్లాద, పరమానందయ్య శిష్యుల కథ, జగదేకవీరుని కథ, పునర్జన్మ, మంగమ్మ శపథం, బబ్రువాహన, ఉమ్మడి కుటుంబం, నర్తనశాల వంటి అనేక చిత్రాలలో ఆమె నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
గుండమ్మకథ చిత్రాన్ని పంపిణీదారులు చూసిన తర్వాత, అందులో ఎల్. విజయలక్ష్మి నృత్యం ఉంటే బాగుంటుందని సూచించగా, అప్పటికప్పుడు ఆరు నిమిషాల నృత్య ప్రదర్శనను కంపోజ్ చేసి చిత్రీకరించారు. ఈ నృత్యాన్ని అక్కినేని నాగేశ్వరరావు, జమున, హరనాథ్ చూస్తున్నట్లుగా చిత్రీకరణకు జతపరిచారు. ఆ నృత్యం, దాని సంగీతం నేటికీ పెద్ద హిట్. తమిళంలో శివాజీ గణేషన్, ఎం.జి. రామచంద్రన్, జెమినీ గణేషన్ వంటి స్టార్స్ తో కలిసి అనేక సినిమాల్లో నటించారు. ఆ రోజుల్లో ఆమెకు హీరోయిన్‌గా నటిస్తే 20,000 రూపాయలు పారితోషికం ఇచ్చేవారట, అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావులకు కేవలం 15,000 మాత్రమే. సావిత్రి, జమున, రాజసులోచన వంటి హీరోయిన్‌లంత అందగత్తె కాకపోయినా, నృత్యంలో మాత్రం ఆమెతో పోటీపడగలవారు అప్పట్లో లేరని పేరుంది.
డాన్సర్ గా రాజసులోచన ప్రభంజనానికి విజయలక్ష్మి అడ్డుకట్ట వేశారని చెబుతారు. 1960ల దశకం చివర్లో జ్యోతిలక్ష్మి రంగప్రవేశంతో విజయలక్ష్మి వెనకబడ్డారు. 1969లో విడుదలైన ‘ఈటి వారై ఉరవు’ ఆమె చివరి తమిళ చిత్రం. ఆమె సురజిత్ కుమార్ దే దత్తాను వివాహమాడి మనీలాలో స్థిరపడ్డారు. ఆమె వివాహం చేసుకుని వెళ్ళిపోవడంతో, ఆనాటి యువతలో కొందరు తీవ్రంగా నిరాశపడ్డారని అంటారు. మనీలాలో స్థిరపడిన కొన్ని నెలల తర్వాత చెన్నైకి వచ్చినప్పుడు, నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ఆమె ఇంటికి వెళ్లి తాను నిర్మిస్తున్న ‘సిపాయి చిన్నయ్య’ సినిమాలో ఒక డాన్స్ చేయమని కోరగా ఆమె అంగీకరించారట. తెలుగులో అదే ఆమె చివరి సినిమా. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలను అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఆమె సొంతం. సుమారు 79 ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుగ్గా ఉండటం ఆమె అభిమానులకు ఆనందం కలిగించే విషయం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.