Reading Time: < 1 minute
IPL 2026: ‘ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ’

Vaibhav Sooryavanshi: బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత ఏడాది 13 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కోటి పది లక్షల రూపాయల భారీ ధరకు ఎంపికై, ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ ఏడాది గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి, ఐపీఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన అత్యంత చిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇతని భయం లేని బ్యాటింగ్ తీరు చూసి క్రీడా పండితులు సైతం ఫిదా అవుతున్నారు.

ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు: జోస్ బట్లర్

రాజస్థాన్ రాయల్స్ వర్సెస గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనున్న కీలక పోరుకు ముందు, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెట్స్ ప్రాక్టీస్ సమయంలో జోస్ బట్లర్ ఈ యువ సంచలనంతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా బట్లర్ మాట్లాడుతూ.. “నేను చూసిన ఆటగాళ్లలో వైభవ్‌ అత్యుత్తమమైన వాడు. అండర్-19 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌పై అతను చేసిన 175 పరుగులు (80 బంతుల్లో) మా గుండెల్ని పిండేసింది. అతనికి 21 లేదా 25 ఏళ్లు వచ్చేసరికి ప్రపంచ క్రికెట్ అతని పాదాక్రాంతం అవుతుంది. అతని స్వేచ్ఛాయుతమైన ఆటతీరు చూడముచ్చటగా ఉంది” అని ఆకాశానికెత్తేశాడు.

ఐపీఎల్ 2026లో వైభవ్ ప్రతాపం..

ప్రస్తుత సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగుతూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. 305.88 స్ట్రైక్ రేట్‌తో అతను బాదిన ఐదు సిక్సర్లు స్టేడియంను హోరెత్తించాయి.

వైభవ్ గణాంకాలు, రికార్డులు..

ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన అర్థ సెంచరీలు సాధించిన జాబితాలో వైభవ్ ఇప్పుడు దిగ్గజాల సరసన చేరాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, 38.00 సగటుతో 304 పరుగులు చేశాడు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 218.70గా ఉండటం విశేషం. అతి చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో, దూకుడుగా ఆడుతున్న వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా మారాడనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..