Reading Time: 2 minutes

నైనీ కోల్ బ్లాక్ అవినీతి బాగోతాన్ని బయట పెట్టటంతో

భట్టి విక్రమార్క కార్మికులపై ఆక్రోషం పెంచుకున్నారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశంలో ఐదు తీర్మానాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణిలో డిపెండెంట్ కార్మికుల నియామకాల జోలికి వస్తే ప్రభుత్వం తాట తీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఎసిబి విచారణ చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇటీవల అసెంబ్లీలో ప్రకటన చేయటంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల నియామకాలపై కాదు కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. నైనీ బ్లాక్ అవినీతి బాగోతాన్ని బయటపెటట్టంతోనే కార్మికులపై భట్టి విక్రమార్క ఆక్రోషం పెంచుకున్నారని, వారిపై కక్ష తీర్చుకునేందుకే విచారణ అంటూ డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు.తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం ‘సేవ్ సింగరేణి’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు జరిగిన నష్టాన్ని కొంత పూడ్చేందుకు గత ప్రభుత్వం కొన్ని సడలింపులతో 20 వేల కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ పాలసీపై ఎంక్వైయిరీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రాణప్రదాయని అయిన సింగరేణిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి భావోద్వేగం, ప్రేమ, అవగాహన లేవని, అందుకే వారికి కార్మికుల సమస్యలు పట్టటం లేదన్నారు. రాజస్థాన్ ప్రభుత్వంతో సింగరేణి సంస్థ 11 వేల కోట్ల ఒప్పందం చేసుకుందని చెప్పారు. ఒక మెగావాట్ విద్యుత్‌కు అయ్యే ఖర్చుకు మూడు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే విధంగా అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. అదే విధంగా లిథియం రిఫైనరీ అంటూ అల్ట్ మిన్ అనే చిన్న కంపెనీతో రూ. 2250 కోట్ల ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. 27 లక్షలు కూడా ఆదాయం లేని సంస్థతో రూ. 2250 కోట్ల ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.

ఈ రెండు ఒప్పందాల్లో అడ్డగోలుగా అవినీతి ఉందని ఆరోపించారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని…ఈ ఒప్పందాల వెనుక ఉన్న బడా బాబుల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఇచ్చే జీతాల కారణంగా సంస్థపై భారం పడుతుందన్నట్లుగా డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారని…కానీ ప్రభుత్వం చేతగానీ తనంతో సింగరేణిని సర్వనాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ కుంభకోణంలో రూ. 250 కోట్లు, అదనపు ఛార్జీలు వసూలు చేయలేక వెయ్యి కోట్లకు పైగా, లీకేజీ కారణంగా 24 కోట్లు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా 74 కోట్లు సింగరేణికి నష్టం చేశారని చెప్పారు. ఈ విషయం కాగ్ నివేదిక వెల్లండించిందని అన్నారు.

సింగరేణి ఓబీ కాంట్రాక్టర్లు, నాయకులు, అధికారులు, సింగరేణిలో బొగ్గు మింగిన వాళ్లపై ముందు విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం చేతగాని తనంతోనే సింగరేణి కి ఇబ్బందులు తలెత్తాయని కవిత అన్నారు. ప్రభుత్వం దాదాపుగా 47 వేల కోట్ల రూపాయలు సింగరేణికి బకాయి ఉందని గుర్తుచేశారు. చెమట చిందించి సింగరేణిని లాభాల బాట పట్టిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తే తప్పేంటనీ ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెళ్లి ప్రభుత్వంతో మాట్లాడగానే సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ తగ్గించారని చెప్పారు. సింగరేణి విషయంలో ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదని…కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి అవగాహన లేదని అన్నారు.

ఐదు తీర్మానాలు పరిష్కరించాల్సిందే

సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా ఐదు తీర్మానాలు చేశారు. కేంద్రం లేబర్ కోడ్ కు సంబంధించి తెచ్చిన నాలుగు నల్ల చట్టాలను అమలు చేసేది లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని, మెడికల్ బోర్డును మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే ఏర్పాటు చేసి, పెండింగ్ కేసులు పరిష్కరించాలని, అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించాలని, సింగరేణి సంస్థ అల్ట్ మిన్ కంపెనీతో కంపెనీతో రూ. 2250 కోట్లతో చేసుకున్న ఒప్పందంపై శ్వేత పత్రం విడుదల చేయాలని, నైనీ, తాడిచర్ల వంటి బొగ్గు గనులను కొత్త వచ్చే గనులను కూడా సింగరేణి సంస్థయే ఆపరేట్ చేయాలని తీర్మానాలు చేసినట్లు కవిత చెప్పారు. మరో 20 రోజుల్లో రాజకీయ శక్తిగా తాము రాబోతున్నామని, ఈ లోపు ప్రభుత్వం సింగరేణి సమస్యలు పరిష్కరించకపోతే బొగ్గు బాయి బాట పడతామని హెచ్చరించారు.