
భారత హాకీ మరోసారి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో హాకీకి అత్యున్నత సంస్థ హాకీ ఇండియా సీనియర్ అధికారిపై లైంగిక వేధింపులు, అధికార దుర్వినియోగం వంటి తీవ్రఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన క్రీడాకారుల భద్రత, జవాబుదారీతనంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) డైరెక్టర్ హరి రంజన్ రావు, SAI అంతర్గత ఫిర్యాదుల కమిటీ డైరెక్టర్ కల్పనా శర్మలకు ఒక అనామక వివరణాత్మక ఈమెయిల్ వచ్చింది. ఇందులో సదరు అధికారి సాగించిన అరాచకాలను బాధితులు బయటపెట్టారు. మహిళా అధికారులు, కోచ్‌లు ,క్రీడాకారుల పట్ల ఆ అధికారి అత్యంత అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
మహిళా సిబ్బందిని అనుచితమైన ఫోటోలు పంపమని కోరడంతోపాటు అర్ధరాత్రి వేళల్లో అవాంఛిత ఫోన్ కాల్స్ చేస్తూ పర్సనల్ విషయాలు మాట్లాడాలని బలవంతం చేయడం వంటి దుష్ర్పవర్తనకు పాల్పడ్డాడని ఈమెయిల్ లో ఆరోపించారు. తన మాట వినని వారి వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తానని కెరీర్ బెదిరింపులకు గురి చేశాడని తెలుస్తుంది.
►ALSO READ | IPL 2026: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్థాన్.. కెప్టెన్నే మార్చేసిన గుజరాత్
కోచింగ్,ఇతర అవకాశాల కోసం అవినీతికి పాల్పడ్డాడని బాధితులు తెలిపారు. కోచింగ్ , ఇతర అవకాశాలు రావాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఈమెయిల్ లో రాశారు.
మళ్ళీ మళ్ళీ అదే తప్పు..
ఆ అధికారిపై గతంలో అనేక వివాదాల్లో ఆరోపణలు ఉన్నాయి. 2016 నుంచి 2023 మధ్య అతనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. 2023లో అధికారిక ఫిర్యాదు అందడంతో రాజీనామా చేశారు. అయినప్పటికీ వ్యవస్థలోని లోపాలను వాడుకుంటూ సెప్టెంబర్ 2025లో అతడిని రహస్యంగా మళ్ళీ విధుల్లోకి వచ్చారు. మార్చి 2026 నాటికి అతని పేరు అధికారిక ఈవెంట్ జాబితాల్లో ప్రత్యక్షం కావడంతో బాధితులు మరోసారి గళమెత్తారు.
బాధితుల ఆవేదన..
ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి తనను డబ్బు, వ్యక్తిగత ఫోటోలు అడిగేవాడని, అందుకు తాను నిరాకరించినప్పుడు కావాలనే పక్కన పెట్టేశారని ఓ బాధితురాలు కన్నీటీ పర్యంతమయ్యారు. యాజమాన్యం తమ ఫిర్యాదులను పూర్తిగా బుట్టదాఖలు చేస్తోందని అంపైర్లు సైతం ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై హాకీ ఇండియా ,క్రీడా మంత్రిత్వ శాఖ స్పందన కోసం బాధితులు, క్రీడాకారులు ఎదురుచూస్తున్నారు.