
- దంచికొట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్.. రాణించిన నిశాంక, బౌలర్లు
- 6 వికెట్ల తేడాతో ముంబైపై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ
ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై 20 ఓవర్లలో 162/6 స్కోరు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (51) రాణించాడు. అనంతరం రిజ్వీకి తోడు పాథుమ్ నిశాంక మెరుపులతో డీసీ 18.1 ఓవర్లలోనే 164/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.
న్యూఢిల్లీ: ‘ఒక ఆల్‌రౌండర్‌గా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు నేను వ్యతిరేకం’ ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ చెప్పిన మాట ఇది. అక్షర్ నచ్చలేదన్న అదే ఇంపాక్ట్ రూల్ మెగా లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వరుసగా రెండో విజయం అందించింది. తొలి పోరులో లక్నోపై ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి గెలిపించిన ఆ టీమ్ కొత్త కుర్రాడు సమీర్ రిజ్వీ (51 బాల్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 90) ఈసారి ముంబై ఇండియన్స్‌పై మరింత ఇంపాక్ట్‌ఫుల్ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. 163 టార్గెట్ ఛేజింగ్‌లో 7 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన అతను అద్భుత ఆటతో అదరగొట్టాడు.
బుమ్రా, శాంట్నర్, కార్బిన్ బాష్, దీపక్ చహర్, శార్దూల్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను రఫ్ఫాడించాడు. రిజ్వీ వరుసగా రెండో ఫిఫ్టీతో దంచికొట్టడంతో శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై 20 ఓవర్లలో 162/6 స్కోరు చేసింది. స్టాండిన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (36 బాల్స్‌లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51) రాణించాడు. అనంతరం రిజ్వీ, పాథుమ్ నిశాంక (30 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) మెరుపులతో డీసీ 18.1 ఓవర్లలోనే 164/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. సమీర్ రిజ్వీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
- సూర్య, రోహిత్ పోరాటం
అనారోగ్యం కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం అవ్వడంతో సూర్యకుమార్ నాయకత్వంలో ఆడిన ముంబై బ్యాటింగ్‌లో తడపడింది. సూర్య, రోహిత్ శర్మ (35) తప్ప మిగతా టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు నిరాశపరిచారు. పవర్‌ప్లేలోనే పేసర్ ముకేశ్ కుమార్ రెండు వికెట్లు తీసి ముంబైని ఆదిలోనే దెబ్బతీశాడు. ముకేశ్ దెబ్బకు మూడో ఓవర్లోనే ఓపెనర్ రికెల్టన్ (9), తిలక్ వర్మ (0) ఔటవ్వడంతో 18/2తో కష్టాల్లో పడ్డ టీమ్‌ను రోహిత్, సూర్య ఆదుకున్నారు. రోహిత్ తనదైన స్టయిల్లో బౌండ్రీలు కొట్టి 41/2తో పవర్ ప్లేను ముగించాడు. తర్వాత లెగ్ స్పిన్నర్ విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో లాంగాన్ మీదుగా సిక్స్ బాదగా.. వెంటనే అక్షర్ బౌలింగ్‌లో సూర్య కూడా సిక్స్‌తో స్పీడు పెంచాడు. కానీ, పొదుపుగా బౌలింగ్ చేసిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ స్లో, వైడ్ బాల్‌కు రోహిత్.. నితీశ్ రాణాకు క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్‌కు 53 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (5) ఫెయిలైనా ఆ తర్వాత వచ్చిన నమన్ ధీర్ (28)తో కలిసి సూర్య స్కోరు100 దాటించాడు. కానీ, ఫిఫ్టీ పూర్తి చేసుకున్న వెంటనే ఎంగిడి బౌలింగ్‌లో సూర్య ఎల్బీ అవ్వడంతో ముంబై స్పీడుకు బ్రేక్ పడింది. డెత్ ఓవర్లలో నటరాజన్, ఎంగిడి ముంబై స్కోరును కట్టడి చేశారు. శాంట్నర్ (18 నాటౌట్)తో కలిసి కాసేపు పోరాడిన నమన్ ధీర్‌ను 19వ ఓవర్లో నటరాజన్ ఔట్ చేయగా.. లాస్ట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కార్బిన్ బాష్ (11 నాటౌట్) స్కోరు 160 దాటించాడు.
- గెలిపించిన సమీర్
ఛేజింగ్ ఆరంభంలో ఢిల్లీ కూడా తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు త్వరగానే వెనుదిరగడంతో ఇబ్బందుల్లో పడ్డ టీమ్‌ను 22 ఏండ్ల రిజ్వీ మళ్లీ ఆదుకున్నాడు. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (1)ను ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే దీపక్ చహర్ పెవిలియన్ చేర్చగా.. రెండో ఓవర్లో నితీశ్ రాణా (0) రనౌటయ్యాడు. 7/2 వద్ద క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వీ తోడుగా పవర్ ప్లేలో నిశాంక వరుస బౌండరీలు కొట్టాడు. శాంట్నర్ ఓవర్లో రెండు ఫోర్లు, శార్దూల్ వేసిన ఐదో ఓవర్లో 6, 4, 4 దంచడంతో పపర్ ప్లేను ఢిల్లీ 42/2తో ముగించింది. ఇక, అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన రిజ్వీ.. స్పిన్నర్ శాంట్నర్ బౌలింగ్‌లో ఫోర్, కార్బిన్ బాష్ ఓవర్లో సిక్స్‌తో స్పీడు పెంచాడు. పదో ఓవర్లో నిశాంకను శాంట్నర్ ఔట్ చేసిన తర్వాత రిజ్వీ ఒక్కసారిగా గేర్ మార్చి విధ్వంసం సృష్టించాడు. కార్బిన్ బాష్‌ను టార్గెట్ చేసి 11వ ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 20 రన్స్ పిండుకొని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
ఆపై, మయాంక్ మార్కండే ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో డేవిడ్ మిల్లర్ (21 నాటౌట్) స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సపోర్ట్ ఇవ్వగా.. రిజ్వీ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దీపక్ చహర్ ఓవర్లో 4, 6.. శార్దూల్ బౌలింగ్‌లో 4, 4, 6 కొట్టి మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసి సెంచరీ దిశగా దూసుకెళ్లాడు. కానీ, జట్టు విజయానికి 12 రన్స్ అవసరమైన టైమ్‌లో బాష్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ట్రై చేసి తిలక్‌కు క్యాచ్ ఇవ్వడంతో నాలుగో వికెట్‌కు 78 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. మిల్లర్ మిగతా లాంఛనం పూర్తి చేయడంతో మరో 11 బాల్స్ మిగిలుండగానే ఢిల్లీ టార్గెట్‌ను అందుకుంది.
సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 162/6 (సూర్య 51, రోహిత్ 35, ముకేశ్ 2/26).
ఢిల్లీ: 18.1 ఓవర్లలో 164/4 (సమీర్ రిజ్వీ 90, నిశాంక 44, దీపక్ చహర్ 1/20)
17 ఐపీఎల్‌లో ముంబైపై ఢిల్లీకి ఇది 17వ విజయం. సీఎస్కే (18 సార్లు) తర్వాత లీగ్‌లో ముంబైని ఎక్కువసార్లు ఓడించిన రెండో టీమ్‌గా పంజాబ్ కింగ్స్ (17 సార్లు) సరసన నిలిచింది.