Reading Time: < 1 minute
SRH vs LSG, IPL 2026 Live Score Updates: సన్‌రైజర్స్ వర్సెస్ లక్నో భీకర పోరు.. కెప్టెన్సీలో ఇషాన్ కిషన్.. పంత్ సేన బోణీ కొట్టేనా?

SRH vs LSG, IPL 2026 Live Score Updates: ఐపీఎల్ 2026 అసలైన మజా ఆదివారం మొదలవబోతోంది. భాగ్యనగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాపై ఘనవిజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న హైదరాబాద్ ఒకవైపు.. మొదటి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూసి కసిగా ఉన్న లక్నో మరోవైపు.. వెరసి ఈ పోరు క్రికెట్ అభిమానులకు అసలైన విందు భోజనంలా మారనుంది. ముఖ్యంగా ఉప్పల్ పిచ్ పరుగుల వరదకు పెట్టింది పేరు కాబట్టి, నేడు సిక్సర్ల సునామీ ఖాయంగా కనిపిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఇది మింగుడుపడని వార్తే. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వీపు గాయంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షల కోసం అతను ఆస్ట్రేలియా వెళ్లాల్సి రావడంతో ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. ఏప్రిల్ 17న అతను మళ్లీ జట్టుతో చేరతాడు. అప్పటి వరకు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. కెప్టెన్‌గా ఇషాన్‌కు ఇది అగ్నిపరీక్ష లాంటిదే. అయితే, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లు ఉండటం అతనికి కొండంత బలం.

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ తమ మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయింది. ముఖ్యంగా రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ ఓపెనింగ్ జోడీ క్లిక్ అవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నో తన పాత ఫార్ములాను వాడాలని చూస్తోంది. ఎయిడెన్ మార్క్రామ్‌ను మిచెల్ మార్ష్‌తో కలిసి ఓపెనింగ్‌కు పంపి, పంత్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడిస్తే బ్యాటింగ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. నికోలస్ పూరన్, ఆయుష్ బదోని వంటి హిట్టర్లు ఫామ్‌లోకి వస్తే లక్నోను అడ్డుకోవడం కష్టమే.