
ఆర్టిఫిషీయిల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యాపార ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చగలదో అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త మాథ్యూ గల్లాఘర్ కథ మరోసారి స్పష్టంచేస్తోంది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త, కేవలం AI టూల్స్ సహాయంతో Medvi అనే టెలిహెల్త్ సంస్థను నిర్మించి, దానిని బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడం విశేషం. 2024లో కేవలం 20,000 డాలర్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ, 2025లోనే వందల మిలియన్ డాలర్ల ఆదాయం సాధించగా, 2026 నాటికి దాదాపు 1.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ వ్యాపార మోడల్‌లో ముఖ్య పాత్ర పోషించినవి AI టెక్నాలజీలే. వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ నుంచి మార్కెటింగ్ వరకు, కస్టమర్ సపోర్ట్ నుంచి కమ్యూనికేషన్ వరకు అన్నింటినీ AI ఆధారంగా నిర్వహించడం గమనార్హం. ChatGPT, Claude, Grok వంటి టూల్స్‌తో కోడింగ్ చేయగా మిడ్‌జర్నీ, రన్‌వే ప్రకటనల రూపకల్పనలో ఉపయోగించబడ్డాయి. అలాగే ఎలివన్‌ల్యాబ్స్ ద్వారా కస్టమర్ కమ్యూనికేషన్ నిర్వహించబడింది. ఈ విధంగా ఒకే వ్యక్తి ఆధ్వర్యంలో పెద్ద స్థాయి కంపెనీ నడవడం సాధ్యమవుతుందనే భావనకు ఇది ఉదాహరణగా నిలిచింది.
అయితే ఈ విజయం వివాదాలకు కూడా దారి తీసింది. టెలిహెల్త్ రంగంలో ప్రిస్క్రిప్షన్ మందుల విక్రయం విషయంలో చట్టపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా GLP-1 మందులను తక్కువ ధరకు అందించడం ద్వారా కంపెనీ వేగంగా ఎదిగినప్పటికీ, ప్రకటనల్లో నకిలీ డాక్టర్లు, టెస్టిమోనియల్స్ ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెంచర్ క్యాపిటలిస్ట్ షీల్ మోహ్నోట్ వంటి నిపుణులు సంస్థ కార్యకలాపాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మెడ్వి కథ AI శక్తిని మాత్రమే కాకుండా, దాని వినియోగంలో ఉన్న నైతిక, చట్టపరమైన సవాళ్లను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. భవిష్యత్తులో AI ఆధారిత వ్యాపారాలు పెరుగుతున్న కొద్దీ, నియంత్రణ వ్యవస్థలు కూడా మరింత కట్టుదిట్టం కావాల్సిన అవసరం స్పష్టమవుతోంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి