
ఉక్రెయిన్‌తో నాలుగేండ్లుగా సాగుతున్న యుద్ధంలో 3.5 లక్షల మంది సైనికులను కోల్పోవడం రష్యాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. దీంతో సైన్యం కోసం రహస్య నియామకాలకు రష్యన్ కంపెనీలు కేంద్రంగా మారాయి. కాంట్రాక్ట్ సైనిక సేవ కోసం అభ్యర్థుల జాబితాలను రూపొందించే ప్రక్రియలో 150 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలను రష్యా అన్వేషించడం ప్రారంభించింది. ర్యాజాన్ ప్రాంతంలో ప్రైవేట్, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు ఉద్యోగులను నామినేట్ చేయాలని ఆదేశిస్తూ అక్కడి గవర్నర్ పావెల్ మల్కోవ్ ఒక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ప్రకారం అవసరమైన అభ్యర్థుల సంఖ్య కంపెనీ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
150 నుండి 300 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు కనీసం ఇద్దరు అభ్యర్థులను, 300 నుండి 500 మంది ఉన్న కంపెనీలు ముగ్గురు అభ్యర్థులను, 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఐదుగురు అభ్యర్థులను నామినేట్ చేయాలని ఆయన ఆదేశించారు. సైనిక సమీకరణ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేసి, ఎంపిక చేసిన వారిని పోరాటానికి సిద్ధం చేయడానికి రష్యా మిలిటరీ, నేవీ కమాండర్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
శిక్షణ పూర్తైన వెంటనే వారిని యుద్ధంలో భాగం చేసే అవకాశం ఉంది. ఈ ఆదేశాలు పాటించని కంపెనీలకు పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..