
వాషింగ్టన్ : 48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ సర్వనాశనం అవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. ఒప్పందం చేసుకోవడానికి , జలసంధిని తెరవడానికి ఇప్పటికే తాను ఇరాన్‌కు ఇచ్చిన పది రోజుల గడువు ముగిసిపోయిందని, అయినా అదనంగా మరో 48 గంటల సమయం ఇస్తున్నానని ఆయన వెల్లడించారు.ఈ గడువు ఏప్రిల్ 6 నాటికి ముగిసిపోతుందని, ఈలోగా హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ సర్వనాశనం కాక తప్పదని ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలు, చమురుబావులు,కీలకమైన మౌలిక సదుపాయాలు అన్నీ నాశనం చేస్తామని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. అమెరికన్ పైలట్ కోసం గాలింపు అమెరికాకు చెందిన ఎఫ్15 యుద్ధ విమానాన్ని ఇరాన్ తమ గగనతలంలో కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లలో ఒకరిని రిస్కూటీమ్ రక్షించింది. మరో పైలట్ తప్పించుకున్నాడు.
అతడి ఆచూకీ కోసం ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్ దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇరాన్ లోని స్థానిక ప్రజలు కూడా ఆ పైలట్ కోసం గాలిస్తున్నారు. అమెరికా పైలట్ కనిపిస్తే బంధించాలని, లేదా చంపాలని అలా చేస్తే భారీ నజరానా అందిస్తామని స్థానిక గవర్నర్ ప్రకటించగా, ఇరాన్ ఆర్మీ మాత్రం తమకు పైలట్ పట్టుబడితే అతడిని అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ ఖైదీగా పరిగణించి అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగిస్తామని ప్రకటించింది. శుక్రవారం ఇరాన్ కూల్చివేసినట్టు చెప్పబడుతున్న అమెరికా రెండు యుద్ధ విమానాల్లో ఒకటి అమెరికా ఎఫ్15 ఇగా గుర్తించారు. విమానాలు రెండు కూలిపోవడం, పైలట్ కోసం ముమ్మరంగా గాలించడం, సహాయక చర్యలు కొనసాగించడంపై చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరాకరించారు. ఏం జరిగినా అవి చర్చలపై ప్రభావం చూపవని ప్రకటించారు.
దుబాయ్‌లో సాంకేతిక దిగ్గజం ఒరాకిల్‌పై దాడి
దుబాయ్ లోని ఒరాకిల్ ప్రధాన కేంద్రంపై ఇరాన్ శనివారం డ్రోన్లతో దాడి చేసింది. దుబాయ్‌లోని షేక్ జయేద్‌రోడ్ హైవేలో ఒరాకిల్ ప్రధాన కేంద్రంపై ఈ దాడి జరిగింది.భవనం శిథిలాలు కూలి స్వల్పంగా కొందరికి గాయాలయ్యాయి. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి 1900 మంది కన్నా ఎక్కువ మంది ఇరానీయులు మృతి చెందగా, అరబ్ దేశాలు, ఆక్రమిత వెస్ట్‌బ్యాంకులో రెండు డజన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 19 మంది ,అమెరికా సిబ్బంది 13 మంది మృతి చెందారు. లెబనాన్‌లో 1300 ప్రజలు ప్రాణాలు కోల్పోగా, మిలియన్ మంది నిర్వాసితులయ్యారు. అక్కడ 10 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందారు.