Reading Time: 2 minutes

IPL 2026: క్లాసెన్, నితీశ్ క్లాసీ బ్యాటింగ్.. లక్నో టార్గెట్ ఎంతంటే!

Caption of Image.

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన SRH టాపార్డర్ బ్యాటింగ్ కుప్పకూలిపోయంది. 8 ఓవర్లలోనే కీలకమైన 4 వికెట్లని కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. లక్నో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ నిప్పులు చెరిగే బంతులతో సన్ రైజర్స్‎ని దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లలోనే స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మని డకౌట్ చేసి SRH ‎కు ఝలక్ ఇచ్చాడు. మూడో ఓవర్లో మళ్లీ బౌలింగ్‎కు వచ్చిన షమీ ఈ సారి విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్‎ (7)ను పెవిలియన్‎కు పంపాడు. దీంతో హైదరాబాద్ 8 పరుగులకే రెండు వికెట్లని నష్టపోయింది. 

ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ జట్టును ఆదుకుంటాడనుకునే లోపే ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన బంతితో హైదరాబాద్ కెప్టెన్‎ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో కేవలం ఒక్క రన్ మాత్రమే చేసి తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు కిషన్. వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డిలు జట్టు బ్యాటింగ్ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. మొదట్లో నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంబించిన వీరిద్దరు, మ్యాచ్ చివరి ఓవర్లో స్టైలిష్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. 

కష్టాల్లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుని గేమ్ లో ఉండేలా చేసిన నితీష్ కుమార్ రెడ్డి– హెన్రిచ్ క్లాసెన్ మధ్య 116 పరుగుల భాగస్వామ్యం బ్రేక్ అయింది. 142 పరుగుల వద్ద మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్ లో నితీష్ కుమార్ ( 33 బంతుల్లో 3 ఫోర్లు 5 సిక్సులతో 56 పరుగులు) ప్రిన్స్ యాదవ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం 19 ఓవర్ వేసిన అవేశ్ ఖాన్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి హెన్రిచ్ క్లాసెన్ (41 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సులతో 62 పరుగులు), హర్ష్ దూబేని గోల్డెన్ డక్ చేశాడు. చివరో ఓవర్లో శివాంగ్ కుమార్ ఫోర్ కొట్టి ఊపుమీద కనిపించినప్పటికీ ప్రిన్స్ యాదవ్ క్లిన్ బౌల్డ్ చేసిన తర్వాత లాస్ట్ బాల్ కి హర్షల్ పటేల్ రనౌట్ కావడంతో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది ఆరెంజ్ ఆర్మీ జట్టు. ఇక లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీసుకోగా, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా, దిగ్వేశ్ రాఠీ, మణిమారన్ సిద్ధార్థ్ తలో వికెట్ పడగొట్టారు.    

©️ VIL Media Pvt Ltd.