
మన తెలంగాణ / హైదరాబాద్ : కేరళలోని ఇడుక్కి జిల్లా ఏలప్పారలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ప్రశంసల వర్షం కురిపించారు. ఇడుపు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇడుక్కి జిల్లాలోని ఏలప్పార లొ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్‌టి సామాజిక వర్గానికి చెందిన సీతక్క తన కృషి, పట్టుదలతో ఎదిగిన గొప్ప నాయకురాలని ఆయన కొనియాడారు. సీతక్క ఒక గొప్ప ఫైటర్, హార్డ్‌వర్కింగ్ మహిళగా ఎప్పటికప్పుడు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఖర్గే పేర్కొన్నారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పరితపిస్తూ, అడవుల్లో తిరుగుతూ ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సేవలు అందిస్తున్న నాయకురాలని ఆయన అభినందించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి కష్టసుఖాలను అర్థం చేసుకుని సేవ చేయడం సీతక్క ప్రత్యేకత అని ఖర్గే చెప్పారు. ఆమె సేవాభావం, నిబద్ధత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రిగా నియమించినట్లు ఆయన వెల్లడించారు.