Reading Time: < 1 minute
Telangana: తెలంగాణలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్.. ఇక మరో పరీక్ష కూడా రాయాల్సిందే..

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మారాయి. ఇక నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందటం అంత ఈజీ కాదు. ఇప్పటివరకు లైసెన్స్ కోసం రెండు టెస్టులు మాత్రమే ఉండేవి. ఒకటి లెర్నర్స్ లైసెన్స్, తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉండేది. అయితే ఇక నుంచి వీటితో పాటు మరో టెస్టు కూడా రాయాల్సి ఉంటుంది. ఎల్‌ఎల్ఆర్ పరీక్షకు ముందు ఆన్‌లైన్‌లో మరో టెస్టు కూడా రాయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ రవాణశాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఇంతకు ఆ పరీక్ష ఏంటి..? ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఎలాంటి కొత్త నిబంధనలు ఏంటి? అనే విషయాలు చూద్దాం.

మూడు దశల ప్రక్రియ

ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్‌కు ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ టెస్టు లాంటి రెండు దశలు ఉండేవి. ముందుగా ఎల్‌ఎల్‌ఎల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష పాసైతే ఎల్‌ఎల్ఆర్ జారీ చేస్తారు. ఇది ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆలోపు డ్రైవింగ్ టెస్ట్ కోసం అప్లై చేసుకుని హాజరవ్వాల్సి ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ పాసైతే డ్రైవింగ్ లైసెన్స్ స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి డెలివరీ చేస్తారు. అయితే ఇక నుంచి ఎల్‌ఎల్ఎల్ టెస్టుకు ముందు మరో పరీక్ష రాయాల్సి ఉంటుంది. అదే ఆన్ లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష. ఇది పూర్తిగా ఆన్ లైన్ విధానంలో ఉంటుంది.

ఆరు మాడ్యూల్స్

ఆన్‌లైన్‌లో జరిగే ఎగ్జామ్‌లో మొత్తం ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొ మాడ్యూల్ 30 నిమిషాల పాటు ఉంటుంది. ఎగ్జామ్ మొత్తం 3 గంటలు ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా, వీడియో ఆధారిత పాఠాలు వంటివి ఉంటాయి. ఇక ల్యా్ప్ ట్యాప్‌లో కెమెరా ఆన్ చేసుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లల్లో కూడా పరీక్షకు హాజరుకావొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాల్సి ఉంటుందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.