Reading Time: 2 minutes
Rcb Vs Csk Ipl 2026 Bangalore Big Win Match Report

ఐపీఎల్ చరిత్రలో అత్యంత క్రేజ్ ఉన్న ఆర్సీబీ-సీఎస్కే పోరులో ఈసారి బెంగళూరుదే పైచేయి అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సాక్షిగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా, భారీ లక్ష్య ఛేదనలో చెన్నై తడబడింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 250/3 పరుగుల భారీ స్కోరు సాధించి, ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది.

Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో టిమ్ డేవిడ్ అసలైన విధ్వంసాన్ని సృష్టించాడు. కేవలం 25 బంతుల్లో 8 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ వేసిన 19వ ఓవర్లో డేవిడ్ 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో ఏకంగా 30 పరుగులు పిండుకుని స్టేడియాన్ని హోరెత్తించాడు. అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ రజత్ పాటిదార్ 19 బంతుల్లోనే 48 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (28), ఫిల్ సాల్ట్ (46) జట్టుకు బలమైన పునాది వేయడంతో ఆర్సీబీ భారీ స్కోరు వైపు సాగింది. చెన్నై బౌలర్లు చిన్నస్వామి పిచ్‌పై తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ భారీగా పరుగులు సమర్పించుకోగా, శివం దూబే ఒక వికెట్ పడగొట్టాడు.

BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో సంక్షోభం.. ఏడుగురు బోర్డ్ సభ్యుల రాజీనామా.. అమీనుల్ ఇస్లాం భారత్‌పై తీవ్ర ఆరోపణలు

251 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ తన మొదటి ఓవర్లోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (7)ను అవుట్ చేయగా, మరోవైపు భువనేశ్వర్ కుమార్ ఆయుష్ మాత్రే (1)ను పెవిలియన్ పంపి ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మొదటి పేసర్‌గా చరిత్ర సృష్టించాడు. స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ (9) కూడా నిరాశపరచడంతో చెన్నై 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 25 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే క్రీజులో పాతుకుపోయిన అతడిని కృనాల్ పాండ్యా స్టంపింగ్ ద్వారా అవుట్ చేయడంతో చెన్నై ఆశలు ఆవిరయ్యాయి.

చివర్లో శివం దూబే (18), జేమీ ఓవర్టన్ (37), ప్రశాంత్ వీర్ (43) పోరాడినప్పటికీ అవి ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. ఆర్సీబీ బౌలర్లు అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నైని 207 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ సమిష్టిగా రాణించి చెన్నై బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టింది. మొత్తానికి చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ బ్యాటర్లు చూపిన తెగివూ, బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన వారికి 43 పరుగుల అద్భుత విజయాన్ని అందించింది.