Reading Time: 2 minutes

శిక్ష నుంచి తప్పించిన బంగారు విత్తనం.. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి..?

Caption of Image.

ఉద్యానవన రాజ్యాన్ని పాలించే రాజు ఉగ్రసేనుడు. అతను చాలా కోపిష్టి. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఒకరోజు మంత్రి శేఖరవర్మ గురించి ఎవరో అజ్ఞాత వ్యక్తి రాజుకు లేఖ రాస్తాడు. అందులో ‘‘మంత్రి గారు పొరుగు దేశం రాజుతో కుమ్మక్కయ్యారు’’ అని ఉంటుంది. అది చదివిన వెంటనే ఉగ్రసేనుడు మండిపడి, నిజానిజాలు విచారించకుండా మంత్రికి జీవిత ఖైదు విధించాడు. 

కారాగారానికి వెళ్లేముందు మంత్రికి ఒక చక్కని ఉపాయం తట్టింది. ఆ ఉపాయాన్ని అమలు చేసేందుకు భటులతో ‘నేను ఒకసారి రాజుగారితో మాట్లాడాలి అనుకుంటున్నట్టు’ చెప్పాడు. దాంతో వాళ్లు మంత్రిని రాజు దగ్గరకు తీసుకెళ్లారు. అప్పుడు మంత్రి రాజుగారితో ‘‘మహారాజా, నా దగ్గర ఒక ‘బంగారు విత్తనం’ ఉంది. దీన్ని నాటి, జాగ్రత్తగా పెంచితే కొన్నేండ్లలో ఆ చెట్టుకు బంగారు కాయలు కాస్తాయి. నేను ఎలాగూ కారాగారానికి వెళ్తున్నాను. కాబట్టి, దీన్ని నాటించండి. మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది’’ అన్నాడు.

రాజు ఏం ఆలోచించకుండా మంత్రి మాటలను పూర్తిగా నమ్మాడు. ఆశతో  ‘సరే’నన్నాడు. మంత్రి ఒక చిన్న విత్తనాన్ని తీసి రాజుకు ఇస్తూ.. ‘‘మహారాజా.. ఈ విత్తనం బంగారు పండ్లు ఇవ్వాలంటే ఒక షరతు ఉంది” అని ఆ షరతును రాజు గారి చెవిలో చెప్పాడు. 

రాజు ఆ షరతు విని ఒక్క క్షణం ఆగిపోయాడు. తను జీవితంలో చేసిన పొరపాట్లు, తొందరపాటు నిర్ణయాలు అన్నీ గుర్తుకొచ్చాయి. 
‘‘నేను నాటలేను మంత్రివర్యా, నాకూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. మన సభలో ఉన్నవాళ్లలో ఎవరితోనైనా నాటిస్తా’’ అన్నాడు. 
ఆ మరుసటి రోజు రాజు ఆ విత్తనాన్ని తీసుకుని సభకు వెళ్లాడు. మంత్రిని కూడా పిలిపించాడు. 

‘‘ఈ సభలో అబద్ధం ఆడని వారు, ఎవరికీ అన్యాయం చేయనివారు ఎవరైనా ఉంటే వాళ్లు వచ్చి ఈ విత్తనం నాటండి” అని మంత్రి చెప్పిన షరతు సభలో బహిరంగపరిచాడు.

సభలో ఎవరూ విత్తనం నాటడానికి ముందుకు రాలేదు. రాజు ఆశ్చర్యపోయాడు. 
అప్పుడు మంత్రి ‘‘మహారాజా! చూశారా? ఈ రాజ్యంలో అత్యున్నత పదవుల్లో ఉన్న మనమే ఎప్పుడూ ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తుంటాం.  అబద్ధం ఆడుతుంటాం. అంటే మనం కూడా పరిపూర్ణులం కాదు. అలాంటప్పుడు మీకు లేఖ రాసిన అజ్ఞాత వ్యక్తి నిజమే చెప్తున్నాడని ఎలా నమ్మారు? నన్ను విచారించకుండా కేవలం ఒక లేఖ ఆధారంగా శిక్ష వేశారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక మనిషి జీవితాన్ని మార్చే శిక్ష వేసేటప్పుడు మీరు ఎంత ఆలోచించాలి?” అని అడిగాడు. 

ఉగ్రసేనుడికి ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది. వెంటనే మంత్రిని క్షమాపణలు అడిగి, గౌరవంగా తిరిగి తన పదవిని ఇచ్చేశాడు. అప్పటినుంచి ఉగ్రసేనుడు ఏ నిర్ణయమైనా ఆచి తూచి, విచారణ చేసిన తర్వాతే తీసుకోవడం మొదలుపెట్టాడు.

– మొర్రి గోపి 

©️ VIL Media Pvt Ltd.