
వాషింగ్టన్: హార్మూజ్ జల సంధిని తెరిచేందుకు విధించిన గడువు ఏప్రిల్ 6తో ముగియనున్న నేపథ్యంలో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హార్మూజ్ జల సంధిని తెరవండి రా పిచ్చి వెదవల్లారా.. లేదంటే నరకానికి పంపిస్తామంటూ పరుష పదజాలంతో హెచ్చరికలు పంపిన కాసేపటికే మరో వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. సోమవారం నాటికి అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని.. ఒకవేళ అగ్రిమెంట్‌పై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలన్నింటినీ పేల్చివేస్తామని బెదిరించారు.
‘‘ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయి. సోమవారం (ఏప్రిల్ 6) ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకపోతే ఆ దేశంలోని మౌలిక సదుపాయాలు అన్నింటిని పేల్చేస్తాం. అలాగే, ఇరాన్‌లోని చమరు వనరులను స్వాధీనం చేసుకుంటాం’’ అని ట్రంప్ హెచ్చరించారు.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఇరాన్ చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో హార్మూజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ పదే పదే ఇరాన్‌ను బెదిరిస్తున్నాడు. కానీ ఈ బెదిరింపులను ఇరాన్ ఏ మాత్రం లెక్క చేయడం లేదు.
►ALSO READ | ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేస్తే.. గల్ఫ్ దేశాలకే రేడియేషన్ ఎఫెక్ట్: అబ్బాస్ అరాఘ్చీ
దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రంప్ ఏప్రిల్ 6 వరకు హార్మూజ్ జలసంధిని తెరవాలని డెడ్ లైన్ విధించాడు. లేదంటే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలు, ఎత్తైన వంతెనలను నేలమట్టం చేస్తామని హెచ్చరించాడు. ట్రంప్ విధించిన గడువు ముగిసేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఇరాన్ వైపునుంచి ఎలాంటి ఉలుకు లేదు పలుకు లేదు. దీంతో ఏం చేయాలో అర్ధం కానీ ట్రంప్ ఇరాన్‌కు బ్యాక్ టూ బ్యాక్ వార్నింగ్స్ ఇస్తున్నాడు.