
నారాయణపేట, వెలుగు: నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కొడంగల్ లిఫ్ట్ స్కీం పనులను రైతులు అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మక్తల్ మండలంలో ప్యాకేజీ–1, ఊట్కూరు మండలంలో ప్యాకేజీ–2 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
ప్రధానమైన ప్యాకేజీ–3 పనులు ప్రారంభించేందుకు అధికారులు శనివారం సిద్ధమయ్యారు. ఈ ప్యాకేజీలో కానకుర్తి చెరువును రిజర్వాయర్‌గా నిర్మించాల్సి ఉండడంతో రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే సేకరించిన భూములకు పరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.
దామరగిద్ద మండలం మల్‌రెడ్డిపల్లి గ్రామ సమీపంలో కానకుర్తి గ్రామ రైతులు అధికారులను అడ్డుకున్నారు. తమ గ్రామంలో సేకరించిన 720 ఎకరాలకు పైగా భూములకు ఇప్పటివరకు పరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండా పనులెలా ప్రారంభిస్తారని నిలదీశారు. 15 రోజుల్లో పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు హామీ ఇచ్చి పనులు చేయకుండానే వెనుదిరిగారు.